మరణంలోనూ వీడని స్నేహ బంధం | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహ బంధం

Published Fri, Nov 10 2023 4:48 AM

సంఘటనా స్థలంలో హెల్మెట్‌ను 
పరిశీలిస్తున్న సీపీ రవిశంకర్‌  - Sakshi

● బైక్‌ అదుపు తప్పి ముగ్గురు మిత్రులు మృతి ● ఉక్కునగరం సెక్టార్‌–10లో దుర్ఘటన ● గంగవరంలో తీవ్ర విషాదం ● కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు

ఉక్కునగరం/పెదగంట్యాడ : తెల్లవారి లేచినప్పటి నుంచీ కలిసే ఉంటూ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండే ముగ్గురు మిత్రులపై మృత్యువు పంజా విసిరింది. కూలి పనులు చేసుకుంటూ కన్నవారికి చేదోడుగా ఉంటున్న స్నేహితులను కబళించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. గంగవరం గ్రామంలో తీవ్ర విషాదం నింపిన ఈ దుర్ఘటన ఉక్కునగరం సెక్టార్‌–10లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఘటనా స్థలిలోనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గంగవరం ప్రాంతానికి చెందిన అర్జిల్లి సోమేష్‌ (19), కదిరి వాసు (19), కొవిరి రాజు (20) ఐటీఐ చదివి స్థానికంగా ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌ పనులు చేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. పూడిమడకలోని స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు ముగ్గురూ కలిసి ఒకే ద్విచక్ర వాహనంపై గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ సెక్టార్‌–10 ప్రాంతంలో మలుపు తిరిగే క్రమంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ పైకి వెళ్లి విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన సోమేష్‌, వాసు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన రాజుకు ఉక్కు జనరల్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్టీల్‌ప్లాంట్‌ సీఐ వి.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, డీసీపీ–2 కె.ఆనందరెడ్డి, సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్‌ ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మూడు కుటుంబాల్లో తీరని శోకం

ఎప్పుడు కలిసిమెలిసి ఉండే ముగ్గురు స్నేహితులు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కుమారులు అనంతలోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కలిసే తిరిగే ముగ్గురు మిత్రులు ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

● కదిరి వాసు (20) తండ్రి భూలోక గతంలో చనిపోవడంతో తల్లి, ముగ్గురు అక్కలతో కలిసి గంగవరంలో నివసిస్తున్నారు. ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు కాగా మూడో అక్కకు పెళ్లి కావల్సి ఉంది. ఇంటికి చిన్నవాడైన వాసుపై కుటుంబం ఆధారపడి ఉండేది. దీంతో ప్లంబింగ్‌తోపాటు ఇతర కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులను కూడా తానే అన్నీ అయి తీరుస్తున్నాడు. మూడో అక్క పెళ్లి కూడా చేసి తండ్రి బాధ్యతను తీర్చడానికి చూస్తున్న సమయంలో విధికి కన్నుకుట్టింది. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదయింది. ఇక మాకు దిక్కెవరంటూ తల్లీ, అక్కలు రోదించిన తీరు అక్కడి వారిని కలిచి వేసింది.

● అర్జిల్లి సోమేష్‌ (21) తండ్రి అమ్మోరు గతంలో చనిపోవడంతో తల్లి, తమ్ముడుతో కలిసి గంగవరం గ్రామంలో నివసిస్తున్నారు. సోమేష్‌ కూడా ఇద్దరు మిత్రులతో కలిసి ప్లంబింగ్‌తోపాటు ఇతర కూలి పనులకు వెళ్తుంటాడు. అతని తమ్ముడు కూడా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు ఇక రాడని తెలియడంతో ఆ తల్లి రోదన వర్ణణాతీతం.

● కొవిరి రాజు (18) తండ్రి నూకరాజు స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికునిగా పనిచేస్తున్నాడు. రాజుకు అక్క, చెల్లి ఉన్నారు. ఇటీవల ఐటీఐ పూర్తి చేసిన రాజు కూడా తన ఇద్దరు మిత్రులతో కలిసి ప్లంబింగ్‌, ఇతర కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజు మృత్యువుతో నాలుగు గంటలపాటు పోరాడి... చివరకు తన స్నేహితుల వద్దకు వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు అందని లోకాలకు చేరుకోవడంతో ఇప్పుడు తమకు దిక్కెవరంటూ తల్లిదండ్రులతోపాటు అక్క, చెల్లి రోదించిన తీరు చూపరులను కలిచివేసింది.

వాసు ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు
1/4

వాసు ఇంటి వద్ద విషాదంలో కుటుంబ సభ్యులు

ముగ్గురు స్నేహితులు (ఫైల్‌)
2/4

ముగ్గురు స్నేహితులు (ఫైల్‌)

ప్రమాద స్థలంలో సోమేష్‌, వాసు 
మృతదేహాలు, డివైడర్‌పై పడి ఉన్న రాజు
3/4

ప్రమాద స్థలంలో సోమేష్‌, వాసు మృతదేహాలు, డివైడర్‌పై పడి ఉన్న రాజు

4/4

Advertisement
 

తప్పక చదవండి

Advertisement