పర్యాటకానికి ‘హరిత’హారం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకానికి ‘హరిత’హారం

Published Thu, Nov 9 2023 12:22 AM | Last Updated on Thu, Nov 9 2023 12:22 AM

పర్యాటక శాఖకు చెందిన హరిత నివాస్‌ - Sakshi

● హరితా హోటల్‌ యాత్రీనివాస్‌ ఆధునికీకరణ ● రూ.5.08 కోట్లతో పనులకు ఏపీటీడీసీ శ్రీకారం

సాక్షి, విశాఖపట్నం : అందాల విశాఖ జిల్లా.. పర్యాటక రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రకృతి రమణీయతతో దేశ విదేశీ సందర్శకులకు స్వర్గధామంగా మారింది. ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొత్త పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీచ్‌రోడ్డులో ఉన్న హరిత హోటల్‌ యాత్రీనివాస్‌ భవనాన్ని రూ.5.10 కోట్లతో ఆధునికీకరించాలని నిర్ణయించింది. హరిత హోటల్‌లో ఎక్కువగా పశ్చిమబెంగాల్‌, ఒడిశాతో పాటు ఉత్తర భారతదేశానికి చెందిన పర్యాటకులు బస చేస్తుంటారు. టూరిజం ప్యాకేజీలో వచ్చే టూరిస్టులకు హరిత హోటల్‌ డెస్టినీగా ఉంది. అందుకే అత్యాధునిక సౌకర్యాలతో యాత్రినివాస్‌ని సుందరీకరణ పనులు చేపడుతున్నారు.

స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా పార్టీ జోన్‌

అప్పుఘర్‌లో బీచ్‌ వ్యూలో హరితా హోటల్‌ యాత్రి నివాస్‌ ఉంది. మొత్తం 4 అంతస్తుల భవనంలో 46 గదులు, రెస్టారెంట్‌ ఉంది. 25 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కావడంతో గదుల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల పెచ్చులూడుతున్నాయి. భవిష్యత్తులో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో యాత్రి నివాస్‌ను సుందరీకరించేందుకు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీటీడీసీ) టెండర్లు ఆహ్వానించింది. రూ.5.08 కోట్లకు ఏవీ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ కో సంస్థ ఈ పనుల టెండర్లను దక్కించుకుంది. నాలుగు నెలల్లోగా పనులు పూర్తి చేసి అందించేందుకు అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకుంది. సుందరీకరణలో భాగంగా ముందు భాగంలో ఉన్న బాల్కనీని కుదించి.. గదుల విస్తీర్ణం పెంచనున్నారు. లాంజ్‌ని పెంచి.. వెయింటింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయనున్నారు. కొత్త లిఫ్ట్‌లు రానున్నాయి. టెర్రస్‌పై స్పెషల్‌ అట్రాక్షన్‌గా కొత్తగా పార్టీ జోన్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఏపీటీడీసీ ఇంజినీరింగ్‌ అధికారి రమణప్రసాద్‌ తెలిపారు. బీచ్‌రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా హరిత హోటల్‌ భవన సుందరీకరణ పనులు డిజైన్‌ చేశామని వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని రమణప్రసాద్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement