అంతా గందరగోళం!
నాలుగేళ్ల క్రితం మృతి చెందిన మహిళా ఉద్యోగికి బాధ్యతలు
బదిలీపై వెళ్లిన వారికి సైతం..
గర్భిణులు, బాలింతల అభ్యర్థనలను పట్టించుకోని వైనం
అనారోగ్య సమస్యలున్నా ఎలక్షన్ డ్యూటీ
యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
వికారాబాద్: అవగాహనా రాహిత్యమో.. అనాలోచిత నిర్ణయమో తెలియదుగాని ఎన్నికల ఏర్పాట్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారుల తీరు ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విధుల కేటాయింపులో అడుగడుగునా అవకతవకలే కనిపిస్తున్నాయి. ఓ చోట మృతి చెందిన ఉద్యోగికి విధులు కేటాయిస్తే.. మరోచోట ఉద్యోగ విరమణ పొందిన వారికి, బదిలీపై వెళ్లిన వారికి సైతం డ్యూటీ వేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కలెక్టర్ ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయినా ఆయా శాఖల హెచ్‌ఓడీలు, ఇతర ఉన్నతాధికారుల్లో మాత్రం మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన హెచ్‌ఓడీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పర్యవేక్షణాధికారులు హైదరాబాద్ నుంచే విధులకు హాజరవుతున్నారు.
అరకొర నిధులు
సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా ఖర్చులకు సంబంధించి ఎంత అవసరమనేది ఇండెంట్ చేసిఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం కాగానే కలెక్టర్ ఖాతాలోకి నిధులు విడుదల చేస్తారు. వాటిని జనాభా, జీపీలు, వార్డుల ఆధారంగా ఆయా మండలాలకు కేటాయిస్తారు. కానీ ఈ సారి ఎన్నికల ప్రాసెస్ ప్రారంభమై వారం దాటినా నిధులు కేటాయించకపోవటంతో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఈఓలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పులు చేసి ఏర్పాట్లు చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.3.5కోట్లు అవసరం అని అంచనా వేయగా గురువారం రూ.కోటి విడుదలైంది. ఈ మొత్తాన్ని మండలానికి రూ.5 లక్షల చొప్పున కేటాయించినట్లు సమాచారం. మిగతా నిధులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నామినేషన్లు వేసే సమయంలో ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతాయి. ఒక్కో విడతలో వెయ్యి మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. మూడు నుంచి నాలుగు వేల మందికి పైగా వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. వారికి షూరిటీ ఇచ్చే వారందరూ ఇంటి, స్థలం, నల్లా పన్నులాంటివి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా సామాజిక వర్గాల అభ్యర్థులను బట్టి రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నా ఎన్నికల ఖర్చు నిమిత్తం నిధులు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది.
పరిగి డివిజన్‌లో అనేక లోపాలు
జిల్లాలో 594 జీపీలు, 5,058 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని 262 గ్రామ పంచాయతీలు, 2,198 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో 262 జీపీలను 67 క్లస్టర్లుగా విభజించి 67 మందికి స్టేజ్ వన్ ఆర్‌ఓలుగా విధులు కేటాయించారు. మరో ఆరు మందిని రిజర్వ్‌లో ఉంచారు. మరో 67 మందిని ఏఆర్‌ఓలుగా నియమించారు. వీరిలో సైతం ఆరుగురిని రిజర్వ్‌లో ఉంచారు. ఒక్కో పంచాయతీకి ఒక్కరు చొప్పున స్టేజ్ టూ ఆర్‌ఓలను నియమించారు. 12 మందిని రిజర్వ్‌లో ఉంచారు. వీరందిరికీ విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. అయితే శిక్షణకు హాజరయ్యే సిబ్బంది.. పోలింగ్ డ్యూటీల విషయంలో ఉన్నతాధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. పరిగి డివిజన్‌లో అనేక లోపాలు వెలుగు చూశాయి. నాలుగేళ్ల క్రితం మృతి చెందిన ఓ మహిళా ఉద్యోగికి ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆర్డర్ పాస్ చేశారు. వేరే జిల్లాకు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడికి ఎలక్షన్ డ్యూటీ వేశారు. పదవీ విరమణ పొందగా మరో టీచర్‌కు కూడా విధులు కేటాయించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే విషయంలో కూడా లోపాలు వెలుగు చూశాయి. ఒక్కో ఉద్యోగికి ఒకే రోజు రెండు మూడు చోట్ల హాజరు కావాలని ఆర్డర్ ఇచ్చారు. ఒక్కరికి ఒకే రోజు రెండు చోట్ల ఎన్నికల విధులు వేశారు. మరో వైపు ఒక్కో పాఠశాలలో ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల్లో 50 శాతం వరకు ఎన్నికలకు విధులకు హాజరు ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో మూడు విడతల్లో కూడా వేసిన వారికే మళ్లీ మళ్లీ డ్యూటీలు వేశారు. ఇలా కాకుండా ఒక్కో విడతలో ఒక్కొక్కరికి డ్యూటీ వేస్తే బోధనలో ఇబ్బందులు ఉండేవి కావని ఉపాధ్యాయులు అంటున్నారు.
లోప భూయిష్టంగా
ఎన్నికల విధుల కేటాయింపు


