ఎన్నికలు సజావుగా జరగాలి
కొడంగల్/పరిగి: గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పోలింగ్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధి విధానాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తపై అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గుర్తులు లేకుండా చూడాలని తెలిపారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా సదుపాయలు కల్పించాలన్నారు. ఓటరు స్లిప్పులను పరిశీలించి అర్హులు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక శ్రద్ధ వహించాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సూచించారు. శుక్రవారం పరిగి మండలం రంగంపల్లి క్లస్టర్‌లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అవసరానికి అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోలులో వేగం పెంచండి
దుద్యాల్: వరి ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కొనసాగుతున్న వడ్లు సేకరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం రాసులను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.


