సొంతిల్లుగా ‘పంచాయతీ’!
మాజీ సర్పంచ్ ఆధీనంలో ప్రభుత్వ భవనం బిల్లులు మంజూరైనాసర్కారుకు అప్పగించన వైనం మరో 5 రోజుల్లో కొత్త పాలకవర్గం కొలువు పట్టించుకోని పంచాయతీరాజ్ అధికారులు
బషీరాబాద్: ప్రభుత్వ నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఓ మాజీ సర్పంచ్ తన సొంత ఇల్లులా వాడుకుంటున్నారు. 2023 మార్చిలో రూ.20 లక్షల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ప్రారంభించిన జీపీ నిర్మాణం ఆరునెలల్లో పూర్తిచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లు లు ఆలస్యం కావడంతో ఆ భవనాన్ని నిర్మించిన అప్పటి బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ కుటుంబం ఉపయోగించుకుంటోంది. ఈ ఘటన మండలం రెడ్డిఘణాపూర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద మండలంలోని రెడ్డిఘణాపూర్, గొట్టి గఖుర్ధు, బాబునాయక్‌తండా, వాల్యానాయక్ తండా, పర్వత్‌పల్లి, కొత్లాపూర్ గ్రామాల్లో రూ.1.20 కోట్లు వెచ్చించి పంచాయతీ భవనాలు నిర్మించారు. తాను అప్పు చేసి భవనం నిర్మిస్తే ప్రభుత్వం బిల్లు లు చెల్లించలేదని 2024 నుంచి నేటి వరకు సదరు మాజీ సర్పంచ్ భవనాన్ని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సదరు గుత్తూదారుకు ప్రభుత్వం అక్టోబర్‌లోనే రూ.17 లక్షలు చెల్లించినట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. అయినా భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా దర్జాగా వాడుకోవడం చర్చనీయాంశమైంది.ఇదే విషయా న్ని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వా రు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో కొత్త సర్పంచ్ ఎన్నికై తే ఎక్కడ కూర్చుంటారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే విషయమై సదరు కాంట్రాక్టర్‌ను వివరణ కోరగా తాను ఖాళీ చేయడానికి సిద్ధమని తెలిపారు. బిల్లులు ఆలస్యం కావడంతోనే పంచాయతీ భవనాన్ని వినియోగించుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.


