నాణ్యమైన విత్తనంతో మేలు
అనంతగిరి: రైతులు నాణ్యమైన విత్తనం నాటితే మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండలం ఆలంపల్లి, నారాయణపూర్, పూలమద్ది గ్రామాల్లో రైతులు సాగు చేసిన తోటలు, పంటలను పరిశీలించారు. ఆలంపల్లిలో మేకల చంద్రశేఖర్ రెడ్డి సాగు చేసిన ఆయిల్ పామ్ తోటను సందర్శించారు. సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. అనంతరం నారాయణపూర్‌లో మోహన్ రెడ్డి సాగు చేసిన పసుపు, క్యారెట్, పందిరి పద్ధతిలో సాగు చేసిన పంటలను పరిశీలించారు. గ్రామంలోని ప్రైవేట్ కూరగాయల నర్సరీని సందర్శించి రైతులకు నాణ్యమైన నారు సరఫరా చేయాలని సూచించారు. అక్కడి నుంచి పూలమద్ది గ్రామానికి చేరుకొని రైతు బందేలి సాగు చేసిన బంతి పూలతోట, డ్రాగన్ ఫ్రూట్, చామగడ్డ పంటలతోపాటు నరసింహారెడ్డి పొలాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్, అధికారులు యము న, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


