సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో ఫిర్యాదు
మంచాల: తమ భూమి విషయంలో జోక్యం చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ మధుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబం శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మంచాలకు చెందిన గడ్డం సరోజ భర్త లక్ష్మయ్య గ్రామంలోని 44 సర్వే నంబర్‌లో ఉన్న 2.17 ఎకరాల భూమిని, 1978 నుంచి సాగు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి గతంలో ప్రభుత్వం వీరికి అసైన్డ్ పట్టా ఇచ్చింది. ఇదిలా ఉండగా పలువురు అగ్రవర్ణ కుటుంబాలకు చెందిన వారు తమ భూమిని ఆక్రమించారని, ఈ విషయమై సీఐ వారితో కుమ్మకై ్క తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
రెండు గ్రామాల్లో ఏకగ్రీవానికి చాన్స్!
శంకర్‌పల్లి: మండలంలోని పర్వేద, కొత్తపల్లి గ్రామాల్లో సర్పంచుల పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. పర్వేదలో బీసీ జనరల్ రాగా సర్పంచ్ పదవికి మొత్తంగా ఐదు నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నాలుగు నామినేషన్లు ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. దీంతో సర్పంచ్ అభ్యర్థి ఎన్కతల సురేందర్‌గౌడ్ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. పది వార్డులు సైతం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా కొత్తపల్లిలో జనరల్ రాగా సర్పంచ్ పదవికి రెండు నామినేషన్లు దాఖలు చేశౠరు. అవుసలి ప్రభుచారి తన నామినేషన్ ఉపసంహరించుకోనుండడంతో అక్నాపురం బల్వంత్‌రెడ్డి మాత్రమే పోటీలో ఉండనున్నారు.
ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య
గాంధీఆస్పత్రి: 42 శాతం రిజర్వేషన్లపై అన్యా యం జరిగినందుకే సాయిఈశ్వర్‌చారి ఆత్మత్యాగానికి పాల్పడ్డాడని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ అభివర్ణించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాయిఈశ్వర్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని, బీసీ రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న బీసీ నేతలు, నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని, సాయిఈశ్వర్ మృతిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని, 42శాతం రిజర్వేషన్లపై కేంద్రం దిగిరావాలన్నారు. ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లను ముట్టడించాలని పిలుపు నిచ్చారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీసీ సంఘ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ విరుద్ధమన్నారు.
ఈశ్వరచారి మృతితోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
కాచిగూడ: బీసీలకు ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందునే సాయి ఈశ్వర చారి ఆత్మహత్య చేసుకున్నాడని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో బీసీలు తిరగబడతారని ఆయన పేర్కొన్నారు. సాయి ఈశ్వర చారి మరణంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన అన్నారు. సాయి ఈశ్వరచారి మృతికి సంతాప సూచకంగా ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు చేపట్టాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు.
ఎయిర్‌పోర్టులో
పరిస్థితులపై డీసీపీ సమీక్ష
శంషాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ అంతర్గత కారణాలతో నాలుగు రోజులుగా ప్రయాణికులు పడుతున్న సమస్యలపై శుక్రవారం రాత్రి శంషాబాద్ డీసీపీ రాజేష్ ఎయిర్‌పోర్టులో పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా ఏర్పడుతున్న సమస్యలను ఎయిర్‌పోర్టులోని సంబంధిత ఏజెన్సీలను అడిగి తెలుసుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఎయిర్‌లైన్స్ సంస్థ ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కానుందని ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రతినిధులు డీసీపీ రాజేష్‌కు ఈ సందర్భంగా వివరించారు.


