క్రైం కార్నర్..
చోరీకి పాల్పడిన మైనర్ల రిమాండ్
పరిగి: దొంగతనానికి పాల్పడిన ముగ్గురు మైనర్లను పరిగి న్యాయస్థానం రిమాండ్‌కు తరలించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహనకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన నేనావత్ గోపాల్ గురువారం రాత్రి ముంబై వెళ్లేందుకు పరిగి బస్టాండ్‌కు వచ్చాడు. ఆలస్యం కావడంతో వికారాబాద్ వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మార్కెట్ యార్డులో పడుకోడానికి నడుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలకు బైక్‌పై ముగ్గురు వచ్చి గోపాల్‌ని కొట్టి ఫోన్, కొంత నగదు దోచుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గంజిరోడ్డులో పోలీసులను చూసి మైనర్లు పరిపోతుండగా వెంబడించి సాయిబాబా దేవాలయం పక్కన పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యార్థుల అరెస్టు అప్రజాస్వామికం
సాక్షి,సిటీబ్యూరో: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా.. మారేడుమిల్లి అడవుల్లో గత నెల 18న మావోయిస్టు పార్టీ నాయకులు హిడ్మ ఇతర సభ్యులను ఎన్‌కౌంటర్ చేసిన ప్రదేశంలో నిజ నిర్ధారణ చేయడానికి వెళ్తున్న ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన 14 మంది విద్యార్థుల బృందాన్ని శుక్రవారం ఏపీ పోలీసులు ఆరెస్టు చేయటాన్ని పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఆవుల నాగరాజు,కోట ఆనంద్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అక్రమంగా చింతూరు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించటం దారుమణమన్నారు. సామాజిక బాధ్యతతో రాజ్యాంగబద్ధంగా నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేసి నిజనిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ కనుసన్నల్లో విప్లవకారులను అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఎన్ కౌంటర్ చేసిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజనిర్ధారణకు వెళ్ళిన విద్యార్థులను అరెస్టు చేయడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చతుందన్నారు.


