ఇది స్కాంల సర్కార్
● రెండేళ్లలో చేసిందేమీ లేదు
● బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
యాచారం: రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదని, స్కాంల సర్కార్‌గా పేరు తెచ్చుకోవడం తప్ప అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్‌గౌడ్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. ఎలా స్కాంలు చేయాలి, రూ.లక్షలాది కోట్లు ఎలా సంపాదించుకోవాలనే ధ్యాస తప్ప ప్రభుత్వానికి అభివృద్ధిపై, ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మహానగరం చుట్టూ విస్తరించిన విలువైన భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాల సేకరిస్తే అవే భూముల్లో ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీకి సేకరించిన భూములను తిరిగిస్తామని చెప్పిన వారు నేడు ప్రజల్లోకి వెళ్లడానికే భయపడుతున్నారన్నారు. రెండేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని, మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయని చెబుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులను సమష్టిగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, యాచారం పీఏసీఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లలో ప్రపంచస్థాయి అభివృద్ధి
యాచారం: ప్రపంచస్థాయి అభివృద్ధికి యాచారం మండలం చిరునామాగా మారబోతోందని, వచ్చే పదేళ్ల కాలంలో ఈ ప్రాంతం ఊహించని విధంగా అభివృద్ధి చెందనుందని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. నందివనర్తి, నస్దిక్‌సింగారం, కొత్తపల్లి, మంతన్‌గౌరెల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రూ. కోటిన్నరకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ తెచ్చిన ఫార్మాసిటీని రద్దు చేసి, అదే భూముల్లో ప్యూచర్‌సిటీని నిర్మిస్తున్నామన్నారు. ప్యూచర్‌సిటీ నిర్మాణాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అనుమానాలు కలిగించడానికి కుట్రలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలతో పాటు రూ. కోట్లాది రుణాలిచ్చి కోటిశ్వరులను చేయాలన్నదే సర్కార్ ఉద్దేశ్యమన్నారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.


