లెక్క తేలింది
జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..
వికారాబాద్: ఎట్టకేలకు గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల లెక్క తేలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 50 శాతానికి మించకూడదని నిర్ణయించింది. సోమవారం ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ వీడింది. బీసీలు మాత్రం నిరాశకు లోనయ్యారు. ఆ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్లు 18 శాతానికి పడిపోయాయి. వంద శాతం ఎస్టీలు నివసించే ఆవాసాలు పూర్తిగా వారికే కేటాయించారు. మిగతా జీపీలను మండల జనాభా యూనిట్‌గా తీసుకుని ముందుగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అనంతరం పూర్తి రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా కేటాయించారు. దీంతో ఓవరాల్‌గా జిల్లాలో బీసీలకు 18 శాతం రిజర్వేషన్లు దక్కగా కొన్ని మండలాల్లో జనాభా ప్రాతిపదికన 13 లేదా 14 శాతం స్థానాలు కూడా దక్కాయి.
బీసీలకు తీవ్ర అన్యాయం
ప్రభుత్వ హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఉంటే 250 జీపీలు ఆ సామాజిక వర్గానికి దక్కాల్సి ఉండేది. ప్రస్తుతం 107 సీట్లు మాత్రమే దక్కాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఆశావహులు అందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు సంతోషంలో మునిగిపోగా ప్రతికూలంగా వచ్చిన వారు నిరాశకు గురవుతున్నారు. జిల్లాలో 594 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న జీపీలను ఆ సామాజిక వర్గానికే రిజర్వు చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన తెరపైకి వచ్చింది. గతంలో జిల్లాలో 4,850 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 5,058కు చేరింది. ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నాయకులు, ఆయా వర్గాల నుంచి మద్దతు కోరుతున్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలో..
సర్పంచుల పదవీ కాలం గతేడాది జనవరి 31తో ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తి కావాల్సి ఉన్నా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కావడం ఆశావహుల్లో ఆనందం నింపింది. ఇప్పటికే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కసరత్తు కూడా పూర్తయింది. దీంతో అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు పూర్తి చేశారు.
గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు
జిల్లాలో మొత్తం 594 జీపీలు
మహిళలకు కేటాయించిన స్థానాలు 278
ఎస్టీలకు 119
ఎస్సీలకు 111
బీసీలకు 107
ఆశావహుల్లో వీడిన ఉత్కంఠ
సామాజికవర్గం మహిళలు అన్ రిజర్వ్‌డ్ మొత్తం శాతం
ఎస్టీ (వందశాతం ఎస్టీ
జనాభా ఉన్న తండాలు) 47 45 92
ఎస్టీ (జనాభా ప్రాతిపదికన) 07 20 27
ఓవరాల్‌గా ఎస్టీలకు
కేటాయించిన స్థానాలు 54 65 119 20
ఎస్సీ 51 60 111 18.6
బీసీ 49 58 107 18
అన్ రిజర్వ్‌డ్ 124 133 257 43


