చెంచు కుటుంబాలకు సొంతిళ్లు
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి
తాండూరు రూరల్: చెంచు కుటుంబాలకు సొంతింటి కల నేరవేరుస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ చెంచు కుటుంబానికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. పెద్దేముల్ మండలం చైతన్యనగర్‌లో 163 ఇళ్లు, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలో 14 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అనంతరం చెంచు మహిళలకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జాదవ్, తహసీల్దార్ వెంకట్‌ప్రసాద్, ఎంపీడీఓ రతన్‌సింగ్, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి నాయకులు మహిపాల్‌రెడ్డి, ఉప్పరి మల్లేశం, రియాజ్, శోభారాణి, డీవై నర్సింలు పాల్గొన్నారు.
కొడంగల్‌లో స్వచ్ఛంద బంద్
కొడంగల్ రూరల్: శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే విద్యా సంస్థల నిర్మాణం చేపట్టాలని కేడీపీ జేఏసీ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో సోమవారం పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ముందుగా శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లోనే అప్పాయిపల్లిలో మెడికల్ కళాశాల, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలతోపాటు మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్‌లో సమీకృత గురుకులాలను అక్కడే నిర్మించేందుకు కృషిచేయాలని వ్యాపార సముదాయాలను మధ్యాహ్నం వరకు మూసివేశారు.
పేదలకు ఉపాధి పనులు కల్పించాలి
ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ
కుల్కచర్ల: పేదలకు ఉపాధిహామీ పనులు కల్పిస్తూ ఆర్థిక సహకారం అందించాలని ఏఎంసీ వైస్ చైర్మన్ రామ్మోహన్‌శర్మ అన్నారు. సోమవారం చౌడాపూర్ మండలం మరికల్‌లో ఉపాధిహామీ పనులపై ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఉపాధి కల్పించడంతో పాటు వారికి సమయానుకూలంగా బిల్లులు అందేలా చూడాలన్నారు. గతేడాది తప్పులు జరిగితే వాటిని రీపేమెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిల్లులు అందేలా చర్యలు
హౌసింగ్ ఏఈ నవీన్ కుమార్
దోమ: ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసు కోవాలని హౌసింగ్ ఏఈ నవీన్‌కుమార్ సూచించారు. సోమవారం మండల పరిధిలోని శివారెడ్డిపల్లిలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు నిర్మించుకుంటన్న ఇళ్ల కొలతలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వారికి త్వరితగతిన బిల్లులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వస్తే బిల్లులు జాప్యం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.
కొందుర్గు: తమ పంట పొలాల మీదుగా రోడ్డు వేయొద్దంటూ మండలంలోని చుక్కమెట్టు, ముట్పూర్, ఉమ్మెంత్యాల గ్రామాల రైతులు సోమవారం నగరంలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే తమ భూములు తీసుకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాల్లో రోడ్డు వేయడం ఏమిటని నిలదీశారు. అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలని, లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. కార్యక్రమంలో రైతులు యాదయ్య గౌడ్, రాజు, చెన్న కేశవులు, నర్సింహారెడ్డి, కిష్టారెడ్డి, మల్లేష్, రామయ్య, రాములు, నర్సింలు, శివ తదితరులు పాల్గొన్నారు.
చెంచు కుటుంబాలకు సొంతిళ్లు
చెంచు కుటుంబాలకు సొంతిళ్లు


