రోడ్ల పక్కనే ధాన్యం కొనుగోళ్లు!
దోమ: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక స్థలాలు ఉన్నప్పటికీ, కొంతమంది నిర్వాహకులు ఇష్టారాజ్యంగా, ప్రమాదకరంగా ధాన్యం సేకరిస్తున్నారు. ఆరుగాళలం శ్రమించి పండించిన పంటను రైతులు ఆరబెట్టుకొని, తూకం చేసి సంచులలో నింపి ట్రాక్టర్లలో తీసుకువస్తుండగా, రోడ్ల పక్కనే లారీలు నిలిచి అందులోకి డంప్ చేస్తున్నారు. ప్రధాన రహదారులపై, మూల మలుపుల వద్ద లారీల్లోకి ధాన్యం దించుతున్నారు. ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. బొంపల్లి, బొంపల్లితండా, బాస్‌పల్లి గ్రామాలకు చెందిన బొంపల్లి పీఏసీఎస్ సెంటర్‌లో ధాన్యం విక్రయిస్తారు. సాధారణంగా కేంద్రం నిర్వాహకులు ధాన్యం దించుకుని, తేమ, తాలు శాతాన్ని పరిశీలించాలి. ఆతర్వాతే తూకం వేసి లారీలోకి ఎక్కించాలి. కానీ ఇక్కడ మాత్రం పరిగి– మహబుబ్‌నగర్ ప్రధాన రోడ్డు పక్కనే లారీలను నిలిపి, నేరుగా ట్రాక్టర్ల నుంచి ధాన్యం సంచులు లోడ్ చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్ ప్రాంతంలోనే కొనుగోళ్లు, సురక్షిత స్థలంలోనే లోడింగ్ పనులు చేపట్టాలని సూచిస్తున్నారు.
బొంపల్లి సెంటర్ నిర్వాహకుల ఇష్టారాజ్యం
పరిగి– మహబూబ్‌నగర్ ప్రధాన రోడ్డు పక్కనే లోడింగ్
ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని వాహనదారుల మండిపాటు


