యంత్రాలు లేక.. పంటలు తెగక
● సరిపడా హార్వెస్టర్లు దొరకని వైనం
● నేలవాలుతున్న వరి పొలాలు
● అల్పపీడనంతో ఆందోళన
చెందుతున్న రైతులు
అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు పంట చేతికొచ్చిందని సంబరపడేలోపు సరిపడా వరికోత యంత్రాలు (హార్వెస్టర్లు) దొరకక మదన పడుతున్నారు. మరోవైపు అల్పపీడనం ఏర్పడడంతో వర్షాల భయం వెంటాడుతోంది.
దోమ: ఆరుగాలం శ్రమించి పంటల సాగు చేసే రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సాగు చేసిన నాటి నుంచి పంటలను కాపాడుకునేంత వరకు అన్నీ ఇబ్బందులే. ప్రస్తుతం పంటలను కోసి ధాన్యం విక్రయించుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంట కాలం పూర్తి కావడంతో పొలాలు వరి కోతలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ సరిపడా వరి కోత మిషన్లు(హార్వెస్టర్లు) లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఓ పక్క తుపాను ధాటికి అనేక పంటలు దెబ్బతిన్నప్పటికి.. మళ్లీ అల్పపీడనం ఏర్పడిన వార్త కర్షకుల గుండెల్లో గుబులు రేపుతోంది. దీంతో ఎక్కడ వర్షాలు కురిసి పంటలు నాశనం అవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. నిత్యం వరి కోత యాంత్రాల వద్దకు పరుగులు తీస్తూ గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
వాలిపోతున్న పొలాలు
మండల వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు వరి సాగునే ఎంచుకున్నారు. వానకాలం సీజన్‌లో మండలంలో 16,210 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం ఆ పొలాలన్ని కోత దశకు చేరుకున్నాయి. వరి కోత యంత్రాలు దొరకకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్న యంత్రాలు సమయానికి రాక కోత దశకు చేరుకున్న పంటలు తారిపోయి నేలవాలిపోతున్నాయి. ఇప్పటికే మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా నష్టం చేసినప్పటికీ.. అల్పపీడనం ఏర్పడడంతో రైతులు తీవ్ర కలవరపాటుకు లోనవుతున్నారు. వర్షాలు కురిస్తే ఇన్నాళ్లు చేసిన కష్టం వృథాగా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరి కొంత మంది కర్షకులు హార్వెస్టర్లు దొరకక కూలీలతో కోతలు చేస్తున్నారు. దీంతో భారం ఎక్కువై తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా నష్టం
పొలంలో అప్పు చేసి వరి పంటను సాగు చేశా. మోంథా తుపాన్ ప్రభావంతో పంట నేలవారిపోయింది. చేసేదేమి లేక వరికోత యంత్రాలను ఆశ్రయిస్తున్నాం. కానీ సమయానికి రావడం లేదు. దీంతో గింజలు పూర్తిగా రాలిపోతున్నాయి. తీవ్ర నష్టం వాటిల్లే ముప్పు ఉంది.
– మధుసూదన్‌రెడ్డి, రైతు, బాస్‌పల్లి
చుట్టూ తిరుగుతున్నాం
యంత్రాలు దొరకక పంటను కోయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నేలవాలిపోవడంతో దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేదు. మరోపక్క మొగులు గుబులు రేపుతుండడంతో ధాన్యం ఎక్కడ పాడవుతుందోనని ఆందోళనగా ఉంది. నిత్యం హార్వెస్టర్ల చుట్టూ తిరుగుతున్నాం.
– బాల్‌రెడ్డి, రైతు, గొడుగోనిపల్లి
యంత్రాలు లేక.. పంటలు తెగక
యంత్రాలు లేక.. పంటలు తెగక
యంత్రాలు లేక.. పంటలు తెగక


