ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి’
● 90 రోజుల పాటు కూలీ డబ్బుల పంపిణీ
● జాబ్‌కార్డు ఉన్న లబ్ధిదారులకు మేలు
● నిర్మాణాల్లో వేగం పెరిగే అవకాశం
లబ్ధిదారులకు ఊరట
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా ఇచ్చే 90 రోజుల పని దినాల డబ్బులు ఇంటి నిర్మాణదారులకు మరించి ఊరటనిస్తుంది. సర్కారు ఇచ్చే రూ.5 లక్షలకు అదనంగా రూ.27,630 కూలీ డబ్బులు, రూ.12 వేలు బాత్‌రూం బిల్లు ఇవ్వడంతో ఇంటి నిర్మాణాల్లో వేగం పెరుగుతోంది.
– అనురాధ, ఎంపీడీఓ, నవాబుపేట
నవాబుపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరింత మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలు ఇస్తుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సర్కారు రాయితీపై ఇసుకను సరఫరా చేస్తుంది. ఇంత వెసులుబాటు ఉన్నప్పటికీ ఇంకా సగం మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడంలేదు. దీంతో పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉపాధిహామీని తోడు చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా అదనపు ప్రయోజనం దక్కనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖ, ఉపాధిహామీ అధికారులు కూలీలలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.
ఇలా అమలు చేస్తారు
ఇందిరమ్మ పథకం కింద మొదటి విడతలో నవాబుపేట మండలానికి 700 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 341 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. జాబ్ కార్డు ఉన్న ఇందిరమ్మ గృహ లబ్ధిదారులను అర్హులుగా గుర్తించి 90 రోజుల పని దినాలు కల్పిస్తారు. వారికి రోజుకు రూ.307 చొప్పున రూ.27,630 కూలీల ఖర్చు కోసం చెల్లిస్తారు. అదనంగా రూ.12 వేలు బాత్‌రూం బిల్లు చెల్లిస్తారు. పునాది స్థాయిలో 40 రోజులు, పైకప్పు స్థాయిలో 50 రోజులు కూలీ దినాలు వేయాలని నిబంధన పెట్టారు. ఇంకా స్లాబ్ పడగానే ఆ లిస్టును గృహనిర్మాణ శాఖ అధికారులు ఎంపీడీవోలకు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఽఅధికారులకు పంపిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానమైన కూలీలు ఇతర ఉపాధిహామీ పనులకు వెళ్లడానికి అవకాశం ఉండదు. సంవత్సరం అయ్యాక మళ్లీ వచ్చే 100 రోజుల పనులు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. ఇంటి నిర్మాణస్థాయిని లబ్ధిదారుడు ఫొటోతో సహా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పనులు పూర్తయినా అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి బిల్లుల చెల్లింపులకు అనుమతిస్తారు. అప్పుడు ఎంపిక చేసి లబ్ధిదారుల పేర్లపై మస్టర్ రాసి మేమెంటు చేస్తారు.
మండలంలో 29 మంది ఎంపిక
మండలంలో 700 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో 341 ఇళ్లు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికి 29 మంది లబ్ధిదారులకు ఉపాధిహామీ కింద ఇచ్చే 90 రోజుల పని దినాలు చెల్లించమని ఆదేశాలు వచ్చాయి. దీంతో కూలీలకు అదనంగా లబ్ధి చేకూరనుంది.
ఇందిరమ్మ ఇళ్లకు ‘ఉపాధి’


