రహదారి ఆక్రమణకు యత్నం
దుద్యాల్: ప్రజలు నడిచే రహదారికి అడ్డంగా గొయ్యి తీసి ఆక్రమించడంతో ఓ నిండు బాలింత తీవ్ర అవస్థ పడిన సంఘటన మండల పరిధిలోని పీర్లగడ్డ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుముల్ మైల్వార్ నుంచి చెట్టుపల్లి తండాకు వెళ్లే ప్రధాన దారి నుంచి పీర్లగడ్డ తండాకు రోడ్డు ఉంది. కొన్నేళ్లుగా తండావాసులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ దారికి బీటీ రోడ్డు సైతం మంజూరైంది. అయితే చిలుముల్ మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భూమిలో ఈ రోడ్డు ఉందని అడ్డంగా పెద్ద గోతి తీశాడు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే క్రమంలో తండాకు చెందిన కవితబాయి వారం రోజుల క్రితం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ఆపరేషన్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు ఆమెను డిశ్ఛార్జ్ చేశారు. రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తున్న బాలింతకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వెళ్లేందుకు మార్గంలేక చీకటిలో అలానే నిరసించిపోయారు. చివరకు స్థానికులు ఆమెను గోతిని దాటించారు. అప్పటికే గుమిగూడిన తండావాసులు రోడ్డు ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గొయ్యి తీయడంతో అవస్థ పడిన బాలింత
రహదారి ఆక్రమణకు యత్నం


