సీఎం సాబ్.. జర దేఖో!
వికారాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్న నేపథ్యంలో వరాల జల్లు కురిపిస్తారనే ఆశలో జనం ఉన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. అక్కడి నుంచే జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాతారు. ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయిన కొత్తలో కోస్గీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు.. ఆ తర్వాత రెండు సార్లు దసరా పండుగకు, ఓ సారి పోలెపల్లి జాతరకు చుట్టపు చూపుగా రావడం మినహా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో సీఎం హోదాలో పాల్గొన్నది తక్కువే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండుళ్లు కావస్తున్నా నియోజకవర్గం దాటి మిగతా ప్రాంతాల్లో పర్యటించింది లేదు. ఎన్నికల సమయంలో జిల్లా అంతట పర్యటించిన ఆయన అనేక హామీలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సీఎం వరాల జల్లు కురిపిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
కడా తరహాలో ఉడాను అభివృద్ధి చేయాలని..
సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే తన సొంత నియోజకవర్గం కొడంగల్ సమగ్రాభివృద్ధి కోసం కడా(కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. దీంతో వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలపై వివక్ష చూపుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం జిల్లాలోని అన్ని జీపీలు, మున్సిపాలిటీలను కలుపుతూ ఉడా(వికారాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేశారు. కానీ పెద్దగా ప్రయోజనం చేకూరింది మాత్రం లేదు. కడా తరహాలోనే ఉడాను కూడా అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాకు అనేక పనులు మంజూరయ్యాయి. టెండర్లు కూడా పిలిచారు. ఈ ప్రక్రియ పూర్తయి ఆరు నెలలు దాటినా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. అనేక రహదారులు పాడై ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి, నిధుల మంజూరు విషయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లోని సమస్యల చిట్టాతో సీఎంను కలిసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రజలు ఆశిస్తున్న పనులివే..
● ఎన్నికల సమయంలో జిల్లాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. అందులో కొన్ని..
● జిల్లాకు పాలమూరు నీళ్లు తెచ్చి రైతుల పాదాలు తడుపుతామని హామీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.
● కొత్త మున్సిపాలిటీలు పరిగి, కొడంగల్‌కు ప్రత్యేక నిధులతో పాటు వికారాబాద్, తాండూరు పట్టణాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు.
● తాండూరు పారిశ్రామిక వాడకు గత ప్రభుత్వం జీఓ ఇచ్చి చేతులు దులుపుకోగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు.
● అనంతగిరి పర్యాటక అభివృద్ధి కలగానే మిగిలింది. రూ.1,000 కోట్లు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇవ్వగా పనులు నత్తను తలపిస్తున్నాయి.
● నిధులు లేక తాండూరులో బైపాస్ రోడ్డు పనులు సగంలో ఆగిపోయాయి. ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలనే డిమాండ్ ఉంది.
● జిల్లాను హార్టికల్చర్ జోన్ ప్రకటించి అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు.
● ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
● వికారాబాద్ ఫై ఓవర్ బ్రిడ్జి పనులు నత్తను తలపిస్తున్నాయి.
● వికారాబాద్ సమీపంలోని శివారెడ్డిపేట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చి దిద్దాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
● తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం మధ్యలో ఆగి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
● పరిగిలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది.
● ధారూరు మండలం నాగసముందర్‌లో కాగ్నా నదిపై ఒక టీఎంసీ సామర్థ్యంతో ప్రాజెక్టు కడతామని భూ సేకరణ చేసి వదిలేశారు.
● కోట్‌పల్లి ప్రాజెక్టు అభివృద్ధి నిధులు లేక వెలవెలబోతోంది.
● మన్నెగూడ – వికారాబాద్ వరకు ఫోర్ లేన్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
● వికారాబాద్ నుంచి నవాబుపేట మీదుగా శంకర్‌పల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులు ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.
● నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
● వికారాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
● రూ.1,000 కోట్లతో పలు రోడ్లకు టెండర్లు పలిచి ఆరు నెలలు దాటినా ఇంకా పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు.
నేడు జిల్లాకు ముఖ్యమంత్రి రాక
కొడంగల్ నియోజకవర్గంలో అక్షయ పాత్ర కిచెన్ షెడ్‌కు భూమిపూజ
అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న రేవంత్‌రెడ్డి
వరాల జల్లు కురిపిస్తారనే ఆశలో జనం, ప్రజాప్రతినిధులు
గతంలో నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోని పనులు


