ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, సిక్తా పట్నాయక్, వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్ర, సీఎంఈఓ అధికారి వాసుదేవరెడ్డి ఇతర అధికారులు ఎన్కేపల్లి గేటు సమీపంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించబోయే మధ్యాహ్న భోజనం కిచెన్‌షెడ్ నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేస్తారు. బొంరాస్‌పేటలో గ్రంథాలయ భవన ప్రారంభోత్సవం, హకీంపేట ఎడ్యుకేషన్ హబ్, సైనిక్‌స్కూల్ నిర్మాణ పనులకు సామూహిక శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆదివారం భారీగా పోలీసులు మోహరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సభాస్థలి వద్ద అతిథులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ మొగులప్ప, సబ్‌కలెక్టర్ సుధీర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీపీఎం నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
హకీంపేట్‌లో ఏరియల్ సర్వే
దుద్యాల్: కొడంగల్ పర్యటనలో భాగంగా సీఎం దుద్యాల్ మండలం హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసే ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించే అవకాశం ఉందని ఎడ్యుకేషన్ హబ్ సూపరింటెండెంట్ ఇంజనీయర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం హకీంపేట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి హకీంపేట్ పర్యటన రద్దయిన నేపథ్యంలో హెలిక్యాప్టర్ నుంచి విద్యాలయాలకు కేటాయించిన స్థలాలను పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎడ్యుకేషన్ హబ్ డీఈఈ పీ రాజయ్య, ఏఈ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్కేపల్లి గేటు వద్ద సభాస్థలిని పరిశీలించిన వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, ఉన్నతాధికారులు


