చురుగ్గా జాతీయ రహదారి పనులు
యాలాల: మండలంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. చించోళి నుంచి మహబూబ్‌నగర్ వరకు నాలుగు లేన్ల(167 నేషనల్ హైవే) రోడ్డు పనులు మంజూరు కావడంతో కల్వర్టులు, భారీ సైడ్ డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే నెల రోజుల క్రితం సబ్ కాంట్రిక్టర్లు బిల్లులు మంజూరు కాకపోవడంతో వారం నుంచి పది రోజుల పాటు పనులను ఆపేశారు. ఈ సమస్యను సైట్ కాంట్రాక్టర్ సాన్వర్స్ రైల్‌టెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ పరిష్కరించడంతో పనుల్లో వేగం పుంజుకుంది. సీఎం సొంత జిల్లా కావడం, పనులు జాప్యం పట్ల ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కదలిక వచ్చింది. లక్ష్మీనారాయణపూర్, రసూల్‌పూర్, దౌలాపూర్, తిమ్మాయిపల్లి తదితర స్టేజీల వద్ద అవసరమైన బ్రిడ్జిలతో పాటు భారీ సైడ్ డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే దౌలాపూర్ సమీపంలో నాలుగు లేన్ల తారు రోడ్డు పనులను పూర్తి చేశారు. రోడ్డు మధ్యలో పలు మొక్కలను సైతం నాటారు. లక్ష్మీనారాయణపూర్ నుంచి తాండూరు బైపాస్ మార్గం వరకు పనులు ఊపందుకుంటున్నాయి. పనులు వేగంగా జరుగుతుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


