ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడు
● హైకోర్టు ప్రముఖ న్యాయవాది సాయిప్రసాద్
● ఘనంగా భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు
అనంతగిరి: ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడని హైకోర్టు ప్రముఖ న్యాయవాది డా. ఎస్ సాయిప్రసాద్ అన్నారు. ఆదివారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వికారాబాద్‌లోని స్థానిక జ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ ప్రతిఫలాపేక్షతో చేయకూడదని ప్రేమతో చేయాలని, ప్రేమ ఉన్నచోటే పరమాత్ముడు ఉంటాడని తెలిపారు. బాబా ఒక వ్యక్తి కాదని అతడు ఒక వ్యవస్థ అని, అందుకే సత్యసాయి సేవా సంస్థలు ప్రపంచంలోని అనేక దేశాల్లో వెలిశాయన్నారు. మనిషి వికాసానికి శాస్త్ర విజ్ఞానం, దైవ విశ్వాసం రెండు ముఖ్యమేనన్నారు. అనంతరం విశిష్ట అతిథిగా విచ్చేసిన డా.చంద్రశేఖర్ పట్నాయక్ మాట్లాడుతూ.. నిష్కామ కర్మతో చేసిన ఏ మంచి పనైనా సేవే అని పేర్కొన్నారు. పరమ సత్యాన్ని ఎవరో వచ్చి బోధించరని, నీకు నీవే తెలుసుకోవాలన్నారు. జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు డా. హారతి ద్వారకానాథ్ మాట్లాడుతూ.. సత్యధర్మ శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువలను పాఠాలుగా బోధిస్తూ కోట్ల మంది భక్తుల గుండెల్లో సత్యసాయి కొలువయ్యారని పేర్కొన్నారు. అందరినీ ప్రేమించు.. సేవించు అన్న సాయి సూక్తి మన జీవితాన్ని మహోన్నతం చేస్తుందని తెలిపారు ప్రచారం ఆర్భాటం ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తి ప్రతిష్టలు పెంచవచ్చు కానీ.. అది సమాజానికి మంచి సందేశాన్ని స్ఫూర్తిని ఇవ్వలేదని నొక్కి చెప్పారు. అనంతరం వికారాబాద్ మండల, జిల్లా స్థాయిలో వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. సాయం కాలం దీపోత్సవం, స్వామివారి డోలారోహణం, జవహర్ బాలకేంద్రం విద్యార్థులో కూచిపూడి, భరతనాట్యం నిర్వహించారు. కార్యక్రమంలో కన్వీనర్ సత్యనారాయణ గౌడ్, ఆధ్యాత్మిక సమన్వయకుడు బందప్ప గౌడ్, జిల్లా యూత్ కోఆర్డినేటర్ బసవరాజ్, పాపయ్య, గోపాల్ రెడ్డి, సతీష్ చంద్ర, కొండ మల్లయ్య, కపిల్ దేవ్, విఠోబా, ముట్పూరి అనురాధ, కె.వర్దిని తదితరులు పాల్గొన్నారు.


