కొడంగల్ పోస్టాఫీస్‌లో ఆధార్ సేవలు
కొడంగల్ రూరల్: కొడంగల్ పోస్టాఫీసులో ఆధార్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ పోస్టాఫీసు కార్యాలయాల జిల్లా సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం పట్టణంలోని పోస్టాఫీసు కార్యాలయంలో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డులో పుట్టినరోజు మార్చుకోవడానికి 18ఏళ్ల లోపువారు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని సూచించారు. పేర్లు రెండింటిలోనూ ఒకేలా ఉండాలన్నారు. ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు
బంట్వారం: సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు ఇవ్వనున్నట్లు కోట్‌పల్లి వ్యవసాయ అధికారి కరుణాకర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కల్టివేటర్, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్, పవర్ వీడర్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తిగల రైతులు క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను స్రందించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
లారీ బ్రేక్‌లు ఫెయిలై..
● ఆర్టీసీ బస్సును ఢీ
● తప్పిన ప్రమాదం
పూడూరు: లారీ బ్రేక్‌లు ఫెయిల్ అవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం చన్గోముల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్–బీజాపూర్ హైవేపై తిర్మలాపూర్ స్టేజీ వద్ద మన్నెగూడ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయలయ్యాయి. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని స్టేషన్‌కు తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
సడలింపు ఇవ్వాలి
అనంతగిరి: ప్రస్తుత సీజన్‌లో భారీ వర్షాలు పడినందున పత్తి నాణ్యత నిబంధనలను సడలించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణ సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు 12 క్వింటాళ్లు సేకరించాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పంట కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, సతీష్, లక్ష్మయ్య, అక్బర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గుడికి వెళ్లినమహిళ అదృశ్యం
మొయినాబాద్: గుడికి వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ ఠాణా పరిధి చిలుకూరులో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని చిలుకూరుకు చెందిన అంతిగల్ల వైశాలి(31) శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి హనుమాన్ ఆలయానికి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో మొయినాబాద్ పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
కొడంగల్ పోస్టాఫీస్‌లో ఆధార్ సేవలు


