ఎనిమిది నెలలుగా ఎదురుచూపులు
● వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న స్కావెంజర్లు
● పట్టించుకోని అధికారులు
దౌల్తాబాద్: బాత్‌రూంలో బ్లీచింగ్ చల్లుతున్న స్కావెంజర్ వెంకటప్ప. ఈయన దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం వరకు స్కూలులోనే పనిచేస్తుంటాడు. తరగతి గదులు, గ్రౌండ్‌ను శుభ్రం చేసి ట్యాంకులకు నీరు నింపుతాడు. ఈయనకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. ఎనిమిది నెలలుగా జీతం లేక కుటుంబపోషణ భారంగా ఉంది.
వెయ్యి మంది స్కావెంజర్లు
పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే స్కావెంజర్లు, స్వీపర్లు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న వీరికి ఎనిమిది నెలలుగా జీతాలు పెండింగ్‌లోఉన్నాయి. సాలరీ సమయానికి ఇవ్వడంతోపాటు పెరుగుతున్న నిత్యావసరాలకు అనుగుణంగా పెంచాలని కోరుతున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి మందికి పైగా స్కావెంజర్లు పనిచేస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని స్వీపర్లు, అటెండర్లు ఉద్యోగ విరమణ చేయడంతో కొత్తగా పర్మినెంట్ ఉద్యోగస్తుల నియామకం చేపట్టలేదు. దీంతో పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు గత విద్యా సంవత్సరంలో స్కావెంజర్లను నియమించారు. వీరికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది.
స్కావెంజర్ల విధులు
● టాయిలెట్స్ క్లీనింగ్, బ్లీచింగ్ చల్లడం, ట్యాంకులు నింపడం
● పరిసరాలు, తరగతి గదుల శుభ్రం చేయడం
● ఉపాధ్యాయులు, విద్యార్థులకు తాగునీటి ఏర్పాట్లు.
వేతన వివరాలు
విద్యార్థుల సంఖ్య వేతనం
1–30 రూ.3 వేలు
31–100 రూ.6 వేలు
101–250 రూ.8 వేలు
251–500 రూ.12 వేలు
501–750 రూ.15 వేలు
750కి పైగా రూ. 20 వేలు


