కొనలేం.. తినలేం!
ఏవి కొన్నా రూ.60 పైమాటే దిగుబడి తగ్గడమే కారణం మరింత పెరిగే అవకాశం ఉందంటున్న వ్యాపారులు ఆందోళనలో సామాన్య ప్రజలు
వికారాబాద్: కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సామాన్యులు కొనాలంటేనే జంకుతున్నారు. 15 రోజుల వ్యవధిలో 30 నుంచి 40 శాతం మేర పెరిగాయి. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి పడిపోయింది. ఈ కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సుమారు 27 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నట్లు సమాచారం. క్యారెట్, టమాటా, బీట్రూట్, బెండ, చిక్కుడు, ఆకుకూరల పంటలు కూడా సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు దెబ్బతీశాయి. ఏ కూరగాయ ధర చూసినా రూ.60 నుంచి రూ.100 పై మాటే. పదిరోజుల క్రితం రూ.40 పలికిన కూరగాయలు అమాంతంగా ఎగబాకాయి. కార్తీక మాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో సహజంగానే కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ధరలు పెరగడం పేదలకు ఇబ్బందిగా మారింది.
వర్షాలకు కుళ్లిన పంటలు
నెల రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కూరగాయ పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. క్యారెట్ భూమిలోనే కుళ్లిపోయింది. టమాటా నీటిలో మునిగి పాడైంది. ఆకుకూరలు తడిసి ముద్దయ్యాయి. బీట్రూట్, బెండ, చిక్కుడు తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దిగుబడిపై ప్రభావం పడటంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అంటున్నారు. నియంత్రణ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అమాంతం పెరిగిన కూరగాయల ధరలు
కూరగాయల ధరలు ఇలా.. (కిలోకి..)
కూరగాయ రకం 15రోజుల క్రితం ప్రస్తుతం
టమాటా 20 60
ఉల్లిగడ్డ 20 40
వంకాయ 40 80
పచ్చిమిర్చి 60 80
కాకరకాయ 40 80
చిక్కుడు 40 80
బెండ 60 80
గోరుచిక్కుడు 60 80
క్యారెట్ 40 80
కాలీఫ్లవర్ 40 80
దొండకాయ 40 80
బీట్రూట్ 50 80
క్యాప్సికమ్ 60 80
ఆలుగడ్డ 30 40
బీరకాయ 60 80
క్యాబేజీ 40 60
బీర్నీస్ 60 100
గోంగూర 60 80
పాలకూర 40 80
మెంతికూర 60 100
రైతు బజార్‌లో కాస్త తక్కువ
వికారాబాద్ రైతు బజార్‌లో రైతులే స్వయంగా అమ్ముకుంటేనే ఈ ధరలు ఉన్నాయి. ఇక చిల్లర వ్యాపారులు మాత్రం వీటికి 10 నుంచి 20 శాతం పెంచి విక్రయిస్తున్నారు. ఆ లెక్కన ఏ కూరగాయ ధర తీసుకున్నా.. రూ.80కి మించి పలుకుతోంది. కొనుగోలు చేయాలంటేనే భయమేస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.
‘ఉదయం మార్కెట్‌కు వెళ్లా.. పాలకూర కట్ట(ఒక్కటి) రూ.30 చెప్పారు. ఒక్క పాలకూరతో ఏం చేయాలి.. పప్పు చేద్దామంటే పచ్చిమిర్చి(కిలో రూ.80), టమాటా(రూ.60), ఉల్లిగడ్డ(రూ.40)..తోపాటు కందిపప్పు కొనాలి.. దీంతో భయమేసి ఇంటికి తిరిగొచ్చా..చికెట్ సెంటర్‌కు వెళ్లి రూ.42 పెట్టి అర డజను కోడిగుడ్లు తెచ్చా.. కాసింత ఉప్పు.. కారం వేసి ఫ్రై చేశా.. పిల్లలకు టిఫెన్ పెట్టి.. బాక్స్ కట్టా.. రాత్రికి పులిహోరాతో సరిపెట్టా’ అని వికారాబాద్ పట్టణానికి చెందిన మన్నె వసంత తెలిపారు.


