అప్రమత్తంగా ఉండండి
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం కొడంగల్‌కు వచ్చిన ఆయన పట్టణ శివారులో నిర్మించనున్న అక్షయ పాత్ర వంటశాల స్థలాన్ని పరిశీలించారు. అక్కడే సీఎం భూమిపూజ చేయనున్నారు. అలాగే నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సభాస్థలిని జిల్లా అధికారులు, సీఎం వ్యక్తిగత సిబ్బంది పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, రెండు అంబులెన్సులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శానిటేషన్, బారికేడ్స్, మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, స్టేజ్ ఏర్పాటు, వీఐపీ పార్కింగ్, ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉంటూ పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, డీఈఓ రేణుకాదేవి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, తహసీల్దార్ రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు కొడంగల్‌కు వస్తారు. తాండూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రలైజుడ్ కిచన్ షెడ్‌ను పరిశీస్తారు. అక్కడి నుంచి బయ ల్దేరి పట్టణ శివారులో నిర్మించనున్న అక్షయ పాత్ర సెంట్రలైజ్‌డ్ కిచన్ షెడ్‌కు భూమిపూజ చేస్తారు. అక్కడి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
28వేల మంది విద్యార్థులకు..
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. కొడంగల్ సమీపంలో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ కిచన్ షెడ్‌ను నిర్మిస్తారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుతున్న 28వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించిన కిచన్ షెడ్ నిర్మాణానికి సీఎం భూమిపూజ చేస్తారు.


