ప్రణాళికతో సాగితే మెరుగైన ఫలితాలు
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
దుద్యాల్: చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, దుద్యాల్ పాఠశాలలను సందర్శించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠాలు చెబుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సరైన సమయానికి వస్తున్నారా? పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారా అని అడిగారు. తెలుగు, ఇంగ్లిష్‌లో చదవడం, రాయడాన్ని నేరుగా పరిశీలించారు. అనంతరం దుద్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పక్కా ప్రణాళికతో సాగాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ రామారావు, డీఈవో కార్యాలయ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సీఆర్‌పీ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.


