స్థానిక పోరుకు సిద్ధం కండి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాద్‌రావు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వికారాబాద్‌లోని స్వాగత్ కన్వెన్షన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కో– కన్వీనర్లుగా శ్రీధర్‌రెడ్డి, కృష్ణ ముదిరాజు, రాంచంద్రరావును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర నాయకులు శివరాజు, రమేష్‌కుమార్, మారుతీకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టపరిహారం చెల్లించండి
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీజేపీ జిల్లా కన్వీనర్ కరణం ప్రహ్లాదరావు డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా పంటలు కోల్పోయి రైతులు అప్పుల్లో కూరుకుపోయారని తెలిపారు. అలాగే గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఎర్రమట్టి, ఇసుక, ఇతర ఖనిజాల తరలిస్తుండటంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని తెలిపారు. వెంటనే కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వడ్ల నందు, రాజేందర్‌రెడ్డి, యాస్కి శిరీష, సుచరితారెడ్డి, కేపీ రాజు, నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


