నేడు టీజీఈపీసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

నేడు టీజీఈపీసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

Aug 6 2025 8:23 AM | Updated on Aug 6 2025 8:27 AM

నేడు టీజీఈపీసెట్‌  ధ్రువపత్రాల పరిశీలన

నేడు టీజీఈపీసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

అనంతగిరి: టీజీఈపీసెట్‌–2025 చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన బుధవారం వికారాబాద్‌లోని ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్‌ రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్‌ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తొమ్మిదేళ్ల చిన్నారిపై

యువకుడి అఘాయిత్యం

పూడూరు: తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు ఈ సంఘటన చన్గోముల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండల పరిధిలోని నేవీరాడార్‌లో బిహార్‌కు చెందిన పలు కుటుంబాలు పనిచేస్తున్నాయి. ఇదే రాష్ట్రానికి చెందిన కృష్ణకుమార్‌ (24) ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని లేబర్‌ కోసం నిర్మించిన షెడ్డులోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. ఇది గమనించిన చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ధి చేసి, పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు.

పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్లు

అనంతగిరి: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని ప్రిన్సిపాల్‌ రవీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న స్పాట్‌ అడ్మిషన్‌లు జరుగుతాయన్నారు. బుధ, గురువారాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వాటని పరిశీలించి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు 8న ఉదయం 10గంటలకు అన్ని ఒరిజినల్స్‌ సర్టిఫికెట్లు, మూడు సెట్ల జిరాక్స్‌లతో రిపోర్టు చేయాలన్నారు. సీటు లభించిన వారు వెంటనే రూ.5,080 కౌన్సిలింగ్‌ ఫీజు వెంటనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నియామకం

అనంతగిరి: బీజేపీ పార్టీ వికారాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మహిళ కన్వీనర్‌గా వికారాబాద్‌కు చెందిన మాజీ కౌన్సిలర్‌ టి.శ్రీదేవిసదానందరెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడుతామని, పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొని యువకుడి దుర్మరణం

నిజాంపేట్‌: నగర శివారులోని ప్రగతినగర్‌ ఎలీప్‌ సర్కిల్‌ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక వాటర్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైకు నడుపుతున్న బీటెక్‌ విద్యార్థి నిఖిల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement