
వైభవం.. పెరుగుబసంతం
● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ● గరుడ వాహనంపై విహరించిన అనంత పద్మనాభుడు ● స్వామివారికి పట్టు వస్త్రాలుసమర్పించిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: అనంతగిరి గుట్టపై వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ ఆషాఢమాస చిన్నజాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం పెరుగుబసంతం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయ పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ పెరుగుబసంతంకు సంబంధించిన ప్రత్యేక మహా ప్రసాదాన్ని తయారు చేసి ఉట్టిలో ఉంచారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ స్తంభంపైకి ఉట్టిని ఎక్కించారు. ఉట్టిని పగుల గొట్టి మహా ప్రసాదన్ని భక్తులకు చల్లారు. ప్రసాదం అందుకోవడానికి భక్తులు ఆరాట పడ్టారు. అనంతరం ప్రత్యేక హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మహా ప్రసాదాన్ని పొలాల్లో చల్లితే..
పెరుగుబసంతంలో పంచే మహా ప్రసాదాన్ని పొలా ల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని, ఇంట్లో ఉంచితే కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.గరుడ వాహ న సేవలో, పెరుగుబసంతం వేడుకల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్పీకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఆలయ ఈవో నరేందర్, ట్రస్టీ పద్మనాభం, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు లక్ష్మికాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.

వైభవం.. పెరుగుబసంతం