
విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి
అనంతగిరి: విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు.. రోజూ ఎంత మంది వస్తున్నారు.. గుడ్లు, పాలు ఇస్తున్నారా, బాలామృతం ప్లష్ ఇస్తున్నారా, దివ్యాంగులు, తీవ్ర, అతితీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. అనంతరం హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. పిల్లలకు యూనిఫామ్స్ వేసి, చార్టుపై రాసి పిల్లలతో చదివించాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఎనిమిది, పదో తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలన్నారు. ఇంగ్లిష్ పద్యాలు చదివించారు. 8వ తరగతి విద్యార్థులకు ఐఎఫ్‌పీ ద్వారా బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. పోటీ తత్వంలో ముందుకు సాగాలని సూచించారు. తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. వంట గది, కొత్తగా నిర్మించిన డైనింగ్ హాల్‌ను పరిశీలించారు. వంట తయారు చేసే విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం, సరుకుల నిల్వలను చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థీ మెరిట్ సాధించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలలో పెండింగ్ పనులు ఉంటే సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి, ఎంఈఓ బాబు సింగ్, హెచ్‌ఎం శివకుమార్, అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి తదితరలు పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థీ మెరిట్‌లో పాసవ్వాలి
కలెక్టర్ ప్రతీక్ జైన్