
వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం
అనంతగిరి: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ – 2025లో భాగంగా ప్రతి గ్రామంలో వంద మంది పౌరులతో యాప్‌లో ఫీడ్ బ్యాక్ ఇచ్చేలా పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ సుధీర్ అన్ని మండలాల ఎంపీడీఓలకు సూచించారు. గురువారం కలెక్టరేట్ నుంచి పలు అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయతీలో ఇంకుడు గుంతలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 19 కొత్త జీపీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసి నాటేలా చూడాలన్నారు. వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వానికి తావులేకుండా లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, హౌసింగ్ పీడీ కృష్ణయ్య, పీఆర్ ఈఈ ఉమేష్, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సుధీర్ బూత్ లెవల్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. మార్పులు చేర్పులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, బీఎల్‌ఓలు, మాస్టర్ ట్రైనర్ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు
అదనపు కలెక్టర్ సుధీర్