
నిత్యం 37మంది జననం
వికారాబాద్: గత దశాబ్ద కాలంగా చూస్తే జిల్లాలో జనాభా పెరుగుదల రేటు నిలకడగా కనిపిస్తోంది. అక్షరాస్యతా శాతంలో అట్టడుగున ఉండగా జననాల రేటులో రాష్ట్ర సగటుకు దగ్గరగానే ఉంది. లింగ నిష్పత్తి విషయంలో మన జిల్లా మెరుగ్గా ఉంది. లింగ నిష్పత్తి విషయంలో రాష్ట్ర సగటు కంటే మన జిల్లాలో ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం జనాభా 9.27 (2011 సెన్సెస్) లక్షలు ఉంది. ఇందులో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1001 మంది మహిళలు ఉన్నారు. గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో 13,779 మంది జన్మించగా ప్రతి రోజు సగటున 37మంది ప్రతి గంటకు 1.57 మంది పుడుతున్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. చిన్న పిల్లల లింగ నిష్పత్తి విషయంలో మర్పల్లి మండలంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 1022 మంది బాలికలు అత్యధికంగా ఉండగా యాలాల మండలంలో అత్యల్పంగా ప్రతి వెయ్యి మందికి 900 బాలికలు ఉన్నారు. అక్షరాస్యతా శాతంలో జిల్లాలో వికారాబాద్ మండలం ముందుండగా దౌల్తాబాద్ అన్ని మండలాల కంటే అట్టడుగున ఉంది. మొత్తం జనాభాలో పట్టణ జనాభా 87 శాతం ఉండగా గ్రామీణ జనాభా 13శాతం ఉన్నారు. విస్తీర్ణంలో వికారాబాద్ మండలం పెద్దదిగా ఉండగా జనాభా పరంగా తాండూరు మండలంలో అత్యధిక జనాభా నివసిస్తున్నారు. మొత్తం జనాభా 9,27,140లో 4.7 లక్షల జనాభా ఆయా పనులకు వెళుతున్నారు. ఇందులో 1.65 లక్షల మంది రైతులుగా, 1.91 లక్షల మంది వ్యవసాయ కూలీలుగా ఇంటి పనులకు 0.10 లక్షలు, 1.03 లక్షల జనాభా ఇతర పనులకు వెళుతున్నారు.
లింగ నిష్పత్తిలో మెరుగు
జిల్లాలో వెయ్యి మంది పురుషులకు 1,001 మంది సీ్త్రలు
ఏడాదికి 13,779 జననాలు
మొత్తం జనాభా 9.27 లక్షలు
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం