
దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు రూరల్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బషీరాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శివగీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మ్యాథమిటిక్స్, ఫిజిక్స్, కెమెస్ట్రి, వృక్షశాస్త్రం, జువాలజీ, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 14వ తేదీలోపు రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి కార్మికుల ఆందోళన
ఇబ్రహీంపట్నం: మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి కార్యాలయానికి కార్మికులు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. ఏడాదిగా బిల్లులు, గౌరవ వేతనం చెల్లించడం లేదని అన్నారు. గుడ్లు, రాగిజావ పెట్టాలని ప్రభు త్వం చెబుతోంది తప్ప అందుకు తగ్గ నిధులు మంజూరు చేయడంలేదన్నారు. అప్పులు చేసి గుడ్లు తీసుకొచ్చి పెడుతున్నప్పటికీ బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ఎంఈఓ, ఎస్‌టీఓ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగతున్నా మోక్షం కలగడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్‌ఐ నాగరాజు ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి తాళం తీయించారు. ఎస్‌ఎఫ్‌ఐ, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేశ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.