
హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు
ధారూరు: అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసిన కేసులో నిందితునికి జీవితఖైదు, రూ.7వేల జరిమాన విధిస్తూ మంగళవారం వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్‌జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ధారూరు మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నాగమణి చెల్లెలు కవితకు అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల చంద్రయ్యతో 2008లో వివాహమైంది. వివాహ సమయంలో తల్లిదండ్రులు నగదు రూ. లక్ష, 3 తులాల బంగారం, ఇతర వస్తువులు వరకట్నంగా ఇచ్చారు. పెళ్లైన కొద్ది రోజులకు భర్త చంద్రయ్య తాగుడుకు బానిసై కవితను మానసికంగా, శారీరకంగా వేదించేవాడు. అదనంగా రూ.50వేలు తీసుకరావాలని భార్యపై వత్తిడి తెచ్చాడు. 2012, మార్చి 3న ఓ కంపెనీలో కూలీ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. తల్లిదండ్రుల నుంచి అదనపు కట్నం ఎందుకు తీసుకరాలేదని కవితను బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. ఆమె నిత్యం పడుతున్న బాధలు భరించలేక అతని ముందే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుని బయటకు పరుగుతీసింది. పక్క ఇంట్లో ఉన్న అంజిలమ్మ, లక్ష్మయ్యలు మంటలను ఆర్పెసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కవిత మృతి చెందింది. ఈ సంఘటనపై ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితునిపై 498(ఎ), 302 ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. అప్పటి డీఎస్పీ చౌడేశ్వరీ, ఎస్‌ఐ రమేశ్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదోపవాదాలు విన్న జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. జరిమాన రూ.7వేలు చెల్లించని పక్షంలో అదనంగా మరో 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించారు.
రూ.7 వేల జరిమానా
తీర్పు వివరాలు వెల్లడించిన
ఎస్పీ నారాయణరెడ్డి