
మాడ్గులలో ఆపరేషన్ ముస్కాన్
మాడ్గుల: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి బందీలుగా ఉన్న చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాడ్గుల మండలంలో సీఐ వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం మండలంలో బాల కార్మికుల స్థావరాలుగా నిలిచే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, హోటళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నల్లచెరువు శివారులో ఉన్న పౌల్ట్రీ ఫారంలో పని చేస్తున్న ఇద్దరు బాలికలను గుర్తించారు. యాజమాన్యంపై విచారణ జరుగుతున్నట్లు సీఐ తెలిపారు.
ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా!
తాండూరు: మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో సామూహిక మరుగుదొడ్ల కొనసాగిన స్థలాన్ని కబ్జా చేశారు. మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో మూడు దశాబ్దాల క్రితం సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. ప్రస్తుతం ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో నాలుగేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్‌లో ఆమోదించి మరుగుదొడ్లను తొలగించారు. దీంతో ఆ స్థలంలో మూడేళ్ల క్రితం అంగన్‌వాడీ భవనం నిర్మించారు. చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడంతో మిగిలిన స్థలాన్ని ఆక్రమించి దుకాణాన్ని నిర్మించారు. స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బంగారు గొలుసు చోరీ
ఇబ్రహీంపట్నం: మహిళ మెడలోని గొలుసును లాక్కొని పరారైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కప్పపహాడ్ గ్రామానికి చెందిన బూడిద పద్మమ్మ ఆరుబయట నిలబడి ఇంట్లోకి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 4 తులాల గొలుసును లాక్కొని పరారయ్యాడు.