
తాగునీటికి తండ్లాట!
నవాబుపేట: ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మీది రాతలుగా మారాయి. అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కొనసాగుతుంటే ఆ ఊరిలో మాత్రం అలాంటి సదుపాయం లేదు. కేవలం బోరు మోటారుతో తమ అవసరాలను తీర్చుకుంటున్న పరిస్థితి. అది కూడా కాలిపోయి 15 రోజులు అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు. ఇదీ మండల పరిధిలోని మీనపల్లికలాన్ గ్రామం ఎస్సీ కాలనీలోని దుస్థితి.
మిషన్ భగీరథ పైపులైన్ లేదు
కాలనీలో దాదాపు 80కిపైగా కుటుంబాలుంటాయి. కానీ ఇప్పటివరకు మిషన్ భగీరథ పైపు లైన్ వేయలేదు. ఒక్క ఇంటికి సైతంకుళాయి కనెక్షన్ బిగించిన పాపాన పోలేదు. గతంలో చేసిన పనులకుగాను కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో మధ్యలో వదిలేసినట్లు సమాచారం. దీంతో అప్పటికే ఉన్న ప్రభుత్వ బోరు మోటార్‌తో మాత్రమే కాలనీవాసులు తమ అవసరాలను తీర్చుకుంటూ వస్తున్నారు. గత 15 రోజులు క్రితం ఉన్న కాస్త మోటారు కాలిపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి బోరు మోటారును బాగు చేయిస్తామని తీసుకు పోయారు. కానీ ఇంతవరకు తిరిగి తీసుకు రాలేదు. దీంతో కాలనీలో నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు కార్యదర్శిని సంప్రదిస్తే బోరుమోటారు పూర్తిగా కాలిపోయిందని, కొత్తది కొనడానికి డబ్బులు లేవని చెప్పారు. ఈ సమస్యను ఉన్నతాధికారులకు చెప్పామన్నారు. డబ్బులు రాగానే నూతన బోరుమోటారు తీసుకు వస్తామని తెలిపినట్లు గ్రామస్తులు వివరించారు.
సమస్యను పరిష్కరిస్తా
ఈ విషయమై గ్రామ ప్రత్యేకాధికారి బుచ్చయ్య(తహసీల్దార్) వివరణ కోరగా.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఉందని ఇటీవలే తన దృష్టికి వచ్చిందన్నారు. సోమవారం తాను స్వయంగా వెళ్లి మోటారు బిగించి తాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.
15 రోజులుగా తీవ్ర అవస్థలు
వ్యవసాయ బోర్లను ఆశ్రయించిన వైనం
పట్టించుకోని అధికార యంత్రాంగం
మీనపల్లికలాన్ ఎస్సీకాలనీ దుస్థితి

తాగునీటికి తండ్లాట!