
సాగుకు సాయం.. రైతు మురిపెం
దౌల్తాబాద్: వానాకాలం పంట సాగు సమయంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సీజన్‌కు అమలు చేస్తున్న రైతు భరోసా పథకంతో పంటల సాగుకు ధీమా లభించింది. యాసంగి సాగులో ఈ పథకానికి పరిమితి విధించగా ఈ సారి ఎత్తివేసింది. వానాకాలం పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో జమ చేసింది. తొలిరోజు ఎకరా నుంచి మొదలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దుక్కులు సిద్ధం చేసుకుని ఎరువులు విత్తనాలు కొనేందుకు ఎదురుచూస్తున్న సమయంలో సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న సమయంలో సాయం డబ్బులు జమ కావడంతో రైతులకు ప్రయోజనం చేకూరింది.
సాగు ప్రారంభంలోనే...
వానాకాలం సాగు పనులు ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపులు తీస్తున్నారు. ఇప్పటివరకు సరైన వర్షాలు లేకపోవడంతో వరి సాగు పనులు ఆలస్యమవుతున్నాయి. సాగు ప్రారంభంలోనే ఎదురు చూడకుండానే పెట్టుబడికి సాయం నిధులు అందడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. కొడంగల్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 56,459 మంది రైతులకుగాను రూ.70.59 కోట్ల నిధులు జమ అయ్యాయని అధికారులు తెలిపారు.
భరోసా నిధులతో
వ్యవసాయ పనులకు ఊతం