మహిళాభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి సంకేతం | - | Sakshi
Sakshi News home page

మహిళాభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి సంకేతం

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

● మహిళల భద్రత, సాధికారత పై అవగాహన కార్యక్రమాలు

రేణిగుంట: మహిళాభివృద్ధి రాష్ట్రాభివృద్ధికి సంకేతమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. రేణిగుంట సబ్‌ డివిజన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రత, సాధికారత, సైబర్‌ నేరాల నివారణ, అత్యవసర సహాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తూకివాకం సమీపంలోని ఆర్పీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. సమాజాభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు మహిళ సాధికారతను పక్కన పెట్టి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమన్నారు. మహిళాభివృద్ధి అన్న అంశం కేవలం ఒక వ్యక్తి ఎదుగుదల కాదని, అది ఒక కుటుంబానికి భరోసా, ఒక గ్రామానికి దిశానిర్దేశం, రాష్ట్రానికి అభివృద్ధి సంకేతమన్నారు. స్వయం సహాయక సంఘాలు మహిళల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించాయని తెలిపారు. ప్రతిరోజూ మహిళలను ఒకచోట సమీకరించి భద్రత, చట్టపరమైన హక్కులు, అత్యవసర సేవలపై చైతన్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై చేసే మొదటి తప్పునకే రౌడీషీట్‌ నమోదు చేస్తామని, అదే తరహా నేరాలు మళ్లీ చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ శ్రీలత, ఎస్బీ డీఎస్పీ గీతా కుమారి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు మంజునాథ రెడ్డి, జయచంద్ర, శ్రీకాంత్‌ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, సీడీపీఓ కృష్ణవేణి, మండల వైద్యాధికారి చక్రపాణి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement