పీజీఆర్‌ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌ను అన్నీ విభాగాల అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై పీజీఆర్‌ఎస్‌కు 308 అర్జీలు వచ్చాయి. అందులో 184 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌కు ప్రతి జిల్లా అధికారి తప్పకుండా హజరుకావాలని స్పష్టం చేశారు. అలాగే కలెక్టర్, జేసీ, డీఆర్వోతో పనిలేకుండా మీ డ్యూటీలో భాగంగా క్రమం తప్పకుండా హాజరుకావడంతోపాటు సమయపాలన పాటించడం..మీ వద్దకు వచ్చే ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, దానికి పరిష్కారం చూపే దిశగా పనిచేయాలని చెప్పారు. అంతేతప్ప పరిష్కారం కాకపోయినా పరిష్కారం అయినట్లు లెక్కలు చూపితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్‌మాండ్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద నిరసనలు
కాగా అఖిల భారతీయ జనసంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పలువురు పేదల భూములు, స్థలాలను కబ్జా చేస్తున్నారని, ఆ సమస్య నుంచి బయటపడడానికి నానా తిప్పులు పడుతున్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు 90శాతం మందికి స్థలాలు చూపించారని, మిగిలిన 10 శాతం మందికి స్థలాలు చూపలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారికి స్థలాలు చూపాలని తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన వారితో కలసి సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథం డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థానికులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
పేరూరు చెరువును పటిష్టం చేయండి
పేరూరు చెరువు ప్రమాదస్థితిలో ఉందని సరైన భద్రత కల్పించాలని తిరుపతి రూరల్ ఎంపీపీ చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తిరుపతిలో భూగర్భజలాలను భర్తీ చేయడానికి పేరూరు చెరువు కీలకం అన్నారు. చెరువును మరింత పటిష్టం చేయాలని కోరారు.


