కార్పొ‘రేటు’ కట్టారు! | - | Sakshi
Sakshi News home page

కార్పొ‘రేటు’ కట్టారు!

Dec 2 2025 7:52 AM | Updated on Dec 2 2025 7:52 AM

కార్ప

కార్పొ‘రేటు’ కట్టారు!

ప్రైవేటు విద్యాసంస్థల దందా షురూ!

జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల చేతివాటం

ఇష్టారాజ్యంగా పది పరీక్ష ఫీజు వసూలు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

పర్యవేక్షణలోపంతో రెచ్చిపోతున్న ప్రైవేటు విద్యాసంస్థలు

బంధువులు, స్నేహితులు, చుట్టు పక్కల వారి పిల్లలు ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు, మన పిల్లలను కూడా అక్కడే చదివిస్తే ఉజ్వల భవిత చేకూరుతుందనే మూఢ నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నాటుకుపోయింది. దీంతో ఇష్టమున్నా..లేకపోయినా ప్రైవేటు పాఠశాలలవైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు యాజమాన్యం ఇప్పటికే అధిక ఫీజులు వసూలు.. అభ్యసన సామగ్రి వ్యాపారాలు సాగించాయి. అంతటితో ఆగకుండా పదో తరగతి పరీక్ష ఫీజులోనూ దోపిడీకి తెర లేపాయి. సర్కారు నిర్ణయించిన ఫీజుకు నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డివిరుస్తున్నాయి.

తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌, టెక్నో స్కూల్స్‌ అంటూ పేర్లు పెట్టి ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో అకడమిక్‌ కోర్సులకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులను సైతం మభ్యపెట్టి తమ పాఠశాలల వంక చూడకుండా ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులను అప్పుల పాలు చేసి రూ.కోట్లు దోచుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రభుత్వం మార్చి 16వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు విద్యాసంస్థలు తమ దందాను షురూ చేశాయి.

చెల్లించాల్సిన ఫీజు రూ.125.. వసూలు చేస్తోంది రూ.1200

జిల్లాలోని కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలు మరోసారి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా పదో తరగతి పరీక్షల ఫీజులు రూ.125 చెల్లించాల్సి ఉండగా ఏకంగా నాలురెట్లు పెంచి, ఒక్కో విద్యార్థి నుంచి రూ. 950 నుంచి రూ.1200 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాల దోపిడీకి అంతులేదా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోపాటు వారిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మభ్యపెట్టడంతో ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

జిల్లాలో 206 ప్రైవేటు పాఠశాలల్లో దందా షురూ!

జిల్లాలోని సుమారు 300 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉండగా ఇందులో 206 పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫీజల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోందని విద్యార్థి సంఘాల ప్రత్యేక సర్వేలో తేలింది. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు కలిపి సుమారు 22 వేల మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పది రోజులుగా జిల్లాలోని పలు విద్యార్థి సంఘాలు ప్రైవేటు విద్యా సంస్థల పరీక్ష ఫీజు వసూలుపై ప్రత్యేక నిఘా ఉంచాయి. దీంతో ప్రైవేటు యాజమాన్యాల తీరు బయట పడింది. ఈ విషయమై అధికారులకు సమాచారం అందించినా తూతూ మంత్రంగా దందా చేస్తున్న ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్‌ తక్షణం అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకునేలా జిల్లా విద్యాశాఖను ఆదేశించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

అప్పుల పాలు చేస్తున్నారు

మా అమ్మాయి తిరుపతి నగరంలోని ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో పదో తరగతి చదువుతోంది. ఈనెల 6వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు రూ.125 అని తెలిసింది. కానీ మా వద్ద నుంచి రూ.1200 వసూలు చేశారు. ఫీజు కట్టిన నగదుకు సంబంధించి కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఫీజు కట్టినట్టు మేము నమోదు చేసుకున్నాం. ఇక మీరు వెళ్లండి అని చెప్పారు. సంవత్సరం ఫీజు ఇప్పటికే సుమారు రూ.1.50 లక్షలు చెల్లించాం. పరీక్ష ఫీజుల సైతం ఇంత మొత్తంలో వసూలు చేయడం దారుణం. మమ్ముల్ని అప్పులు పాలు చేస్తున్నారు.

–సరస్వతీదేవి, విద్యార్థిని తల్లి, తిరుపతి

కార్పొ‘రేటు’ కట్టారు!1
1/1

కార్పొ‘రేటు’ కట్టారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement