ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి కల్చరల్: ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ మహమ్మారిపై అప్రమత్తంగా ఉంటూ తద్వారా ఎయిడ్స్ నిర్మూలనకు దోహదపడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం మహతి కళాక్షేత్రంలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ బాధితులు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం అత్యంత ప్రాధాన్యం అని తెలిపారు. హెచ్‌ఐవీ నిర్మూలనకు జిల్లా వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. హెచ్‌ఐవీ సోకిన వారు భయపడాల్సిన అసవరం లేదని, వైద్యుల సూచనల ప్రకారం మందులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. హెచ్‌ఐవీ సంబంధిత పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. అంతకుముందు హెచ్‌ఐవీ బాధితులకు సంఘీభావంగా చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
‘దిత్వా’ తేలిపోయింది
తిరుపతి అర్బన్: దిత్యా తుపాన్‌తో జిల్లాకు భారీ వర్షాలు కురుస్తాయని అంతా భావించారు. అయితే తేలికపాటి వర్షాలతోనే తుపాన్ ప్రభావం తప్పిపోయిందని అధికారులు అంటున్నారు. మూడు రోజులుగా తుపాన్ ప్రభావంతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా సగటున 13.9 మిల్లీమీటర్ల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే అత్యధికంగా సత్యవేడులో 38.2, తడలో 37.4, వరదయ్యపాళెంలో 35.8, బీఎన్ కండ్రిగలో 30.4 మిల్లీమీటర్ల వర్షం పడినట్లు అధికారులు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. అయితే జిల్లాలో రబీ సీజన్ నేపథ్యంలో ఇప్పటికే 1.60 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేసిన రైతులు దిత్వా తుపాన్‌లో నష్టం జరుగుతుందని ఆందోళన చెందారు. తేలికపాటి వర్షాలు రావడంతో ప్రమాదం తప్పిందని ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు అయితే పూర్తి చేశామని...ఏ చెరువుకు 50 నుంచి 60 శాతానికి మించి నీరు చేరకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.


