మంత్రి ఏడిపింఛన్
ఇప్పుడే ఏదో కొత్త పింఛన్లు పంచినట్లు బిల్డప్.. పాత పింఛన్ల పంపిణీకి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ వస్తున్నారని హంగామా.. తిరుపతిలో ఆయన చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ ఉంటుందని హడావుడి.. పింఛన్లు అందుకునే వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు మంత్రి రాక కోసం ఉదయం నుంచి గంటల తరబడి నిరీక్షణ.. పింఛను ఇంటివద్దనే కాకుండా గుంపుగా ఏర్పాటు చేసి ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు.. పింఛన్ చేతికొచ్చేసరికి మధ్యాహ్నం 12:30 గంటలైంది. వీళ్ల ఆర్భాటం కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అని లబ్ధిదారులు తిట్టుకుంటూ ఇళ్లకు వెళ్లారు.
తిరుపతి తుడా: నగరంలో డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీ సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అన గాని సత్యప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఉదయం 11.30 గంటలకు మంత్రి చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, సచివా లయ సెక్రటరీలు రెండు గంటల ముందే జీవకోన అంబేడ్కర్ కూడలి పరిసర ప్రాంతాల నుంచి లబ్ధిదారులను వెంటబెట్టుకుని తీసుకువచ్చారు. మంత్రి మధ్యాహ్నం 12.15 గంటలకు రావడంతో లబ్ధిదారులు నిరీక్షించక తప్పలేదు.
ఇంటి వద్దకు వెళ్లకనే..
లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి గౌరవంగా పింఛను పంపిణీ చేసే పటిష్టమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే మంత్రి వస్తున్నాడని లబ్ధిదారులందరినీ ఒకే చోట గుంపుగా ఉంచి, పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇలాగేనా పింఛన్లు పంపిణీ చేసేదంటూ కొంతమంది అసహనం వ్యక్తం చేశారు. దీనిపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులుగా మిమ్మల్ని ఎవరు ఏర్పాటు చేయమన్నారు? లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయించాలని తెలియదా? అంటూ ఆమె మండిపడ్డారు.
బల ప్రదర్శనలా పింఛన్ పంపిణీ
పింఛన్ల పంపిణీ కార్యక్రమం బల ప్రదర్శనలా సాగింది. వాహనాలతో ఆ ప్రాంతం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టిలో పడేందుకు ఎవరికి వారు పోటీపడ్డారు. ఫొటో కనిపించేందుకు ఎగబడ్డారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఎన్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ , టీడీపీ నేతలు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీధర్ వర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు.


