
మైనింగ్ లీజు వ్యవహారంపై సర్వే
సైదాపురం : మండల కేంద్రమైన సైదాపురంలోని మైనింగ్ లీజు భూముల వ్యవహారంపై శుక్రవారం తహసీల్దార్ సుభద్ర, ఉద్యానశాఖాధికారి ఆనంద్, అటవీ అధికారి శ్రీనివాసులు సంయుక్తంగా సర్వే చేశారు. సైదాపురంలోని 793 సర్వే నంబర్‌లో సుమారు 114 ఎకరాల 71 సెంట్ల భూమి ఉంది. ఆ భూమి కొండ పొరంబోకుగా రెవెన్యూ రికార్డులో ఉంది. గతంలో ఆ భూమిలో మైనింగ్ లీజు ఉండేది. కాలక్రమేణా ఆ లీజు గడువు ముగిసింది. దీంతో సుమారు 21 మందికి పైగా పేదలు ఆ ప్రాంతంలో నిమ్మ, మామిడి చెట్లు వేసుకుని పంటలను సాగు చేస్తున్నారు. సుమారుగా 40 ఎకరాల భూమిని వారు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఆ గనికి లీజు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఆ రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు అందించారు. దీంతో ఆ భూములను సమగ్ర సర్వే చేసేందుకు ప్రభుత్వం జాయింట్ సర్వే బృందంను ఏర్పాటు చేసింది. సర్వేలో భాగంగా సాగులో ఉన్న నిమ్మ, మామిడి చెట్లను అధికారులు పరిశీలించారు. ఈ విషయమై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు తెలిపారు.