
బాబు గారూ.. ఇదీ చంద్రగిరీ.. !
● బడగనపల్లెలో దారికి అడ్డంగా కూటమి నేతల ఇనుప కంచె ● మూడు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేని కుటుంబం ● అటవీ సమీప గ్రామంలో రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ జీవనం
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు గారూ.. మీ స్వగ్రామం నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతలు రాజకీయ ప్రతీకారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశాంతమైన పల్లెలకు రక్తపు మరకలు అంటిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో వేసిన దారులను మూసివేస్తున్నారు. గృహ నిర్భందాలకు పాల్పడుతున్నారు. అప్పటికీ మాట వినకుంటే భౌతికంగా దాడులు చేస్తున్నారు.. కూటమి నేతల దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనమే గత మూడు రోజుల క్రితం జరిగిన బడగనపల్లి ఘటన. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారి పల్లె పంచాయతీ పరిధిలోని బడగనపల్లెకు చెందిన వెంకటరమణ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన జనసేన సానుభూతిపరులు కక్షగట్టారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడుగా ఉన్న వెంకటరమణ ఇంటికి వెళ్లే దారిని ఇనుప కంచెతో మూసివేశారు. అది కూడా పంచాయతీ నిధులతో నిర్మించిన సిమెంటు దారి. మూడు రోజులుగా ఇంటి నుంచి బయటకు వెళ్లలేక నరకం చూస్తున్న వెంకటరమణ కుటుంబీకుల గోడు స్థానిక అధికారులు ఎవరికీ పట్టడం లేదు. బడగనపల్లె అసలే అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న గ్రామం.. అందులో వెంకటరమణ నివసించే ఇల్లు పొలాల్లో ఉంది. ఆ పల్లెకు సమీప ప్రాంతంలోని పొలాల్లోనే ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇటీవల చిట్టేచెర్లలో ఓ రైతును తొక్కి చంపేశాయి. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఇంటి నుంచి వెలుపలకు రాలేక నరకం అనుభవిస్తోంది. ఇదేనా కూటమి ప్రభుత్వం మంచి పాలన? ఇదేనా మీరు చేస్తున్న మంచి? అంటూ ఆ కుటుంబం ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి వస్తున్న మీరైనా ఆ కుటుంబం గోడు పట్టించుకుని న్యాయం చేస్తారని ఆకాంక్షిస్తోంది.

బాబు గారూ.. ఇదీ చంద్రగిరీ.. !