
రాక్షస పాలన నుంచి మహిళలను కాపాడు తల్లీ !
తిరుపతి మంగళం : కూటమి రాక్షస పాలన నుంచి మహిళలకు రక్షణ కల్పించి కాపాడు గంగమ్మ తల్లీ అంటూ తిరుపతి కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషతో పాటు వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు వేడుకున్నారు. మాజీ మంత్రి ఆర్‌కె.రోజాపై నగిరి ఎమ్మెల్యే గాలిభానుప్రకాష్ నాయుడు మహిళలను కించ పరుస్తూ చేస్తూ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఎర్ర దుస్తులు ధరించి చేతుల్లో హారతులు పట్టుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ శిరీష మాట్లాడుతూ.. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పిస్తాం, మహిళల జోలికి ఎవ్వరైనా వస్తే తాట తీస్తామని గొప్పలు చెప్పిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు కీచకుల్లా మహిళలను కించపరిచి మాట్లాడడం, హేళన చేయడం, దాడులు చేయడం వంటివి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఆర్‌కె. రోజాపై గాలి మాటలు మాట్లాడడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వానికి మహిళలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకురాళ్లు మునీశ్వరి, మునిరత్నమ్మ, పార్టీ నగర బూత్‌కమిటీ అధ్యక్షురాలు ముప్పాల సాయికుమారి, గోలి విజయలక్ష్మి, పద్మజ, రాజేశ్వరి, లక్ష్మీరాజ్యం, శాంతారెడ్డి, అనిత, ఉష, కుమారి, మంజుల, ఆదిలక్ష్మి, పుణీత, పుష్పలత, అరుణ, లక్ష్మికాంతమ్మ, కస్తూరి, సుశీల పాల్గొన్నారు.