
ముగిసిన ఉపగ్రహ తయారీ వర్క్‌షాప్
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్‌లో రెండు రోజులుగా నిర్వహించిన ఉపగ్రహ తయారీ వర్క్‌షాప్ శుక్రవారం ముగిసింది. అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా చైన్నెకి చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా సహకారంతో విద్యార్థులకు ఈ వర్క్‌షాపును నిర్వహించారు. దీనికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌ను ఉద్దేశించి రీజనల్ సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించి వారిని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ సంస్థల భాగస్వామ్యం, సహకారంతో సైన్స్ సెంటర్ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఉపగ్రహాలు ఎలా పనిచేస్తాయి, వాటిలోని రకాలు, వాటి పనితీరు, కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించడంతో పాటు వారితో ఉపగ్రహాల తయారీపై వర్క్‌షాపును నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం ఈ వర్క్‌షాపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో సైన్స్ సెంటర్ సిబ్బంది, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.