
అదృశ్యమైన విద్యార్థులు క్షేమం
చంద్రగిరి : చెప్పా పెట్టకుండా హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులను 24 గంటల్లో చంద్రగిరి పోలీసులు గుర్తించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చి శుక్రవారం చంద్రగిరిలో తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రభుత్వ బీసీ హాస్టల్ నుంచి తిరుపతికి చెందిన శ్యామ్ నాగరాజ్, పీలేరుకు చెందిన గోపిచంద్ 9వ తరగతి చదువుతున్నారు. గురువారం తెల్లవారుజామున వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. దీంతో వార్డెన్ వనజ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ అనిత విద్యార్థుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం చిత్తూరు జిల్లా సదుంలో విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సదుంకు చేరుకున్న చంద్రగిరి పోలీసులు శ్యామ్ నాగరాజ్‌తో పాటు గోపిచంద్‌ను క్షేమంగా చంద్రగిరికి తీసుకొచ్చారు. పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో మందలించారని, హాస్టల్ నుంచి ఇంటికి పంపిచేస్తామని బెదిరించడంతో పారిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. అనంతరం ఎస్‌ఐ అనిత.. విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.