
కొడుకు చేతిలో తల్లి హతం
తిరుపతి క్రైం : తల్లి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని జీర్ణించుకోలేక తిరుపతిలో ఓ యువకుడు తల్లిని హతమార్చిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొంపిచర్ల మండలానికి చెందిన ఓ మహిళ (37)కు చిన్నగొట్టిగల్లుకు చెందిన వ్యక్తితో వివాహం అయింది. ఆమె భర్త ప్రస్తుతం ఉపాధి కోసం కువైట్‌లో ఉంటున్నాడు. భార్య తన ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతి ఆటోనగర్‌లోని పూలవానిగుంటలో నివాసం ఉంటోంది. ఓ షోరూంలో సేల్స్ ఉమన్‌గా ఆమె పనిచేస్తోంది. పెద్ద కుమారుడు పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం చదువు నిలిపేసి ఇంటి వద్దనే ఉన్నాడు. రెండో కుమారుడు ఇటీవల ఇంటర్ పూర్తిచేసుకుని ప్రస్తుతం డిగ్రీలో చేరాడు. అయితే ఆ మహిళ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని పెద్ద కుమారుడు గమనించాడు. దీంతో కోపం ఆపుకోలేక గురువారం అర్ధరాత్రి అనంతరం తల్లిపై దాడిచేసి గొంతు నులిమి హత్య చేశాడు. తల్లి మృతి చెందిన అనంతరం శుక్రవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో వారి తాతకు, అమ్మమ్మకు ఫోన్‌చేసి విషయం తెలియజేశాడు. హుటాహుటిన వారు తిరుపతికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాల తరలించారు.