
● బాలింతలకు కరువైన కేంద్ర ఆర్థికసాయం ● లెక్కలోకి రాని వ
అమ్మతనం ఓ వరం.. ప్రసవం మహిళకు పునర్జన్మతో సమానం.. అయితే
కూటమి సర్కారుకు పచ్చిబాలింతలన్న
మానవత్వం, దయ, జాలి, కనికరం
లేకపోయింది. తల్లీబిడ్డకు కేంద్రం అమలు చేసిన జననీ సురక్ష యోజన కింద ఇచ్చే ప్రోత్సాహకానికి తూట్లు పొడుస్తోంది. కేంద్రం వరమిచ్చినా.. రాష్ట్రానికి చేతులు రావడం లేదు. నిబంధనలు మార్చి..నమోదులో నిర్లక్ష్యం ప్రదర్శించి..కనికరం లేకుండా
ప్రవరిస్తోంది. జననీ సురక్ష యోజన
పథకాన్ని జననీ నిర్ధయ యోజనగా
మార్చింది.
జననీ సురక్ష యోజన పల్లెల్లో పడకేసింది.. అమ్మలకు రక్షణ లేకుండా పోయింది. ఇందులో సాయం పేద కుటుంబాలకు మహిళలకు అందడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకున్న వారు లెక్కల్లోకి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం అక్కడకు వెళ్లే వారి వివరాలును యాప్‌లోకి నమోదు చేయడానికి ప్రత్యేకించి సిబ్బంది లేకపోవడమేనని తెలుస్తోంది. ఈ పథకం అమలు తీరులో అస్పష్టతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు పలుమార్లు ఆస్పత్రులకు తీసుకొచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పారా మెడికల్ సిబ్బందిదే కీలక పాత్ర ఉంటుంది. జననీ సురక్ష యోజన నిధులకు సంబంధించి గర్భిణులు, బాలింతల వివరాలను నమోదు చేయడంలో అవాంతరాలు చోటు చేసుకోవడం, పలు చోట్ల లబ్ధిదారు వివరాలు నమోదు చేసినా నగదు జమ కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య, ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని అడిగితే వారి నుంచి సమాధానం రావడం లేదు.
తిరుపతి రూరల్: కూటమి ప్రభుత్వం బాలింతలపై అలసత్వం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే జననీ సురక్ష యోజన సాయాన్ని కూడా లబ్ధిదారులకు చేర్చడంలో విఫలమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని బాలింతలకు అందించాల్సిన చేయూత గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో బాలింతల వివరాలు నమోదు చేయడానికి తగినంత సిబ్బంది లేకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలు యాప్‌లో నమోదు కాకపోవడంతోనే బాలింతలకు కేంద్రం అందించే సాయం అందకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మూడు విడతలుగా రూ.6 వేలు
ఒక మహిళకు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొంత కాలం వరకు మూడు పర్యాయాలుగా రూ.6 వేలు అందుతుండేది. గర్భ నిర్ధారణ అనంతరం తొలిగా రూ.వెయ్యి, ప్రసవ సమయంలో రూ.2,500, అనంతరం టీకాలు వేసే సమయంలో మిగిలిన రూ.2,500 ఇచ్చేవారు. తొలి, మలి ప్రసవాలకు ఈ ప్రోత్సాహక మొత్తాలను అందించేవారు. తెల్లరేషన్ కార్డు దారులైతే ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పు చేసుకున్నా సరే ఈ పథకాన్ని వర్తింపజేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునే వారికి పథకాన్ని వర్తింప చేయడం లేదన్న వాదనలు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి.
సిబ్బంది కొరత.. ప్రచారలోపం
బాలింతలకు అందాల్సిన కేంద్ర సాయం అందకపోవడానికి సిబ్బంది కొరత, ప్రచార లోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని కేంద్ర సాయాన్ని పేదలకు అందేలా చూడాల్సినప్పటికీ ఆ దిశగా దృష్టి పెట్టకపోవడం, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకున్న రేషన్ కార్డుదారులకు వర్తింపజేయకపోవడంతో వేలాది మంది బాలింతలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవించిన తల్లుల వివరాలు మాత్రమే ప్రభుత్వ యాప్‌లో నమోదు చేయడం, వారికి మాత్రమే బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా డబ్బులు జమ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాణభయంతో ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే తెల్లరేషన్ కార్డుదారులకు కూడా ఈ పథకం వర్తింప చేయాలని పలువురు కోరుతున్నారు.
ఆస్పత్రుల్లో ప్రసవాలే లక్ష్యం
మాతా శిశు మరణాలను తగ్గించాలనే సదుద్దేశంతో కేంద్రం అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన పథకాన్ని ప్రధానమంత్రి మాతృ వందన యోజనతో జత కలిపారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో రూ.5 వేలు, జననీ సురక్ష యోజనలో మరో రూ.వెయ్యితో కలిపి మొత్తం రూ.6 వేలు లబ్ధిదారుకు అందజేస్తున్నారు. ఈ పథకంతో నివాసాల్లో జరిగే కాన్పులను పూర్తిగా నిర్మూలించి, ఆస్పత్రుల్లో మాత్రమే ప్రసవాలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. అలా చేయడంతో వైద్యుల పర్యవేక్షణతో తల్లీబిడ్డ, క్షేమంగా ఉంటారనే సంకల్పంతో ఈ పథకాన్ని కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది.
గత ప్రభుత్వంలో జననీ సురక్ష యోజన పథకం ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లేవారు. గర్భిణులకు ఆస్పత్రుల్లో ఉచితంగా రక్త పరీక్షలు చేయడం, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వీరికి చికిత్సలు అందించారు. గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవించే వరకు ఎప్పుడు రక్తం అవసరమైనా ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఎక్కించేవారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రిలోనే సాధారణ ప్రసవం, లేదా సిజేరియన్ చేసి, ఉచితంగా మందులు కూడా అందించేవారు. ఆస్పత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయిన వెంటనే ఆమెను ఇంటికి 108 వాహనంలో తీసుకువెళ్లి వదిలిపెట్టేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఈ పథకం ఎంతో ఉపకరిస్తుంది. అయితే కూటమి సర్కారు దీనికి పూర్తి భిన్నంగా అమలు చేయడంతోపాటు కేంద్రం అందించే సాయాన్ని కూడా అందించలేని పరిస్థితికి తీసుకు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది గడిచినా డబ్బులు రాలేదు
నేను ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవం చేసుకున్నాను. నాకు తెల్లరేషన్ కార్డు కూడా ఉంది. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నా దగ్గర వివరాలన్నీ తీసుకుని ప్రభుత్వానికి పంపించామన్నారు. నా ప్రసవం జరిగి ఏడాదికిపైగా గడుస్తోంది. ఇప్పటివరకు జననీ సురక్ష యోజన పథకం కింద డబ్బులు రాలేదు. అదేమని అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే నేరుగా బ్యాంకు అకౌంట్‌కే పడుతుందంటున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు.
–శాంతి, అనుప్పల్లి, రామచంద్రాపురం మండలం
గత ప్రభుత్వంలో ఎలా అమలు
చేశారంటే..

● బాలింతలకు కరువైన కేంద్ర ఆర్థికసాయం ● లెక్కలోకి రాని వ