
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో మెరిసిన తిరునగరి
● రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్
తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డుకు తిరుపతి నగరపాలక సంస్థ ఎంపికైంది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌తో కలసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య అవార్డును అందుకున్నారు. మూడు లక్షల జనాభా కేటగిరీలో తిరుపతి నగర నగరపా లక సంస్థ సూపర్ స్వచ్ఛలీగ్‌ను కై వశం చేసుకుంది. పరిశుభ్రమైన పరిసరాల ద్వారా ఆరోగ్యకర సమాజం సాధించే లక్ష్యంతో ప్రధాని మోదీ రూపొందించిన స్వచ్ఛభారత్ విప్లవం కొనసాగుతోంది. ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో అవార్డులను ప్రకటిస్తూ మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపిక కావడంపై మేయర్, కమిషనర్‌తోపాటు పలువురు నగర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సి బ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలోని అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది, నగర ప్రజలతోపాటు ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఈ అవార్డు సాధించగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించగలుగుతామన్నారు.