
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో జారిపడిన భక్తుడు
తిరుమల : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్న మానసిక స్థితి సరిగా లేని ఓ భక్తుడు బుధవారం తెల్లవారుజామున వైకుంఠం క్యూకాంప్లెక్స్ –1లో గేటు ఎక్కి దూకే క్రమంలో జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుమల వన్ టౌన్ ఏఎస్‌ఐ మోహన్ నాయుడు కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం బడాంపూర్‌కు చెందిన ఎల్లయ్య రెడ్డి(50) నలుగురు స్నేహితులతో కలిసి ఈనెల 15వ తేదీ తిరుమలకు చేరుకుని, సుదర్శన్‌లో గదిని పొందిన అనంతరం సర్వదర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్–1 సమీపంలో క్యూలో స్నేహితుల నుంచి విడిపోయిన ఎల్లయ్యరెడ్డి వారి వద్దకు చేరుకునే క్రమంలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ రెండో అంతస్తుకు చేరుకునే క్రమంలో గేటు ఎక్కి దూకడానికి ప్రయత్నించి, జారి కిందపడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకోగా ఎవరూ గుర్తించలేదు. బుధవారం ఉదయం గుర్తించిన తితిదే భద్రతా సిబ్బంది, పోలీసుల ద్వారా తీవ్రంగా గాయపడిన అతడిని తిరుపతిలోని స్విమ్స్ అస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అతని చేతులు, కాళ్లు విరిగిపోయి, తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే అతడితోపాటు వచ్చిన స్నేహితులను పోలీసులు విచారించగా అతడు మానసికంగా కొంత ఇబ్బందిపడుతున్నాడని ఈ క్రమంలో ఆందోళనకు గురై ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. దీనిపై తిరునుల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పంటలపై గజ దాడులు
చంద్రగిరి: మండలంలోని చిన్నరామాపురం, భీమవరం గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటలపై మంగళవారం అర్థరాత్రి సుమయంలో సుమారు 7 ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేశాయి. వరి పంటను తొక్కి వేశాయి. ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశాయి. పశువులకు రైతులు వేసిన పశుగ్రాసాన్ని కూడా తొక్కేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాట్టిల్లింది.