
● కబ్జాదారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి ● నారాయణవన
ఎమ్మెల్యే కొడుకు చెప్పాడంటూ భూ కబ్జా
తిరుపతి కల్చరల్: ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు సుమన్ చెప్పాడంటూ కొందరు తమ భూమిని కబ్జా చేయడమేకాక ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నారాయణవనం మండలం, ఎరుకంబట్టు గ్రామానికి చెందిన బాధితులు పన్నీరు సెల్వం, వెంకటేషన్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నారాయణవనం మండలం, ఎరుకంబట్టు గ్రామ రెవెన్యూ లెక్కదాఖలా సర్వేనంబర్ 86/1లో 77 సెంట్లు, 88/2(86/2సి)లో ఎకరా 92సెంట్లు, 86/3లో 14 సెంట్లు మొత్తం 2.83 సెంట్లు భూమి తమ తాత చంద్రప్ప కృష్ణప్ప మొదలి పేరిట ఉందని, ఈ భూమి వారి వారసులమైన తాము ఐదుగురం అనుభవిస్తున్నామని తెలిపారు. సదరు భూమిని తాము భాగపరిష్కారం కోసం తిరుపతి 3వ అదనపు జిల్లా కోర్టులో ఫిర్యాదు చేయడంతో కేసు నడుస్తోందన్నారు. అయితే ఈనెల 10వ తేదీన ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్ చెప్పారంటూ మాజీ ఎంపీపీ గోవిందస్వామి, ఆయన కుమారుడు ముఖేష్ మరి కొందురు జేసీబీతో తమ భూమిలోకి ప్రవేశించి చెట్లు తొలగించి వ్యవసాయ బావిని కూడా పూడ్చి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తాము భూమి దగ్గరకు వెళ్లి వారిని అడ్డుకుని ప్రశ్నిస్తే వారు తమపై దౌర్జన్యం చేయడమేకాక భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. భూమికి సంబంధించిన పక్కా రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే రాజకీయ పలుకుబడితో తమపై దౌర్జన్యానికి దిగుతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రత్నిస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పిలిచి భూమి పత్రాలు అడిగితే ఇప్పటి వరకు వారికి చూపలేదని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ పలుకుబడితో తమ భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సి.రమేష్, సీపీ.దొరైరాజ్ పాల్గొన్నారు.